తుమకూరులో భారీ పరిశ్రమ
ఏర్పాటు కానున్న ‘ఇంటిగ్రేటెడ్ మిషన్ టూల్ పార్క్’
నాలుగు వేల మందికి ఉపాధి
రూ.4 లక్షల అవినీతికి పాల్పడిన పీడబ్ల్యూడీ ఇంజనీర్‌కు నిర్బంధ పదవీ విరమణ
{పవాసీ భారతీయ దివస్ నిర్వహణకు రూ.20కోట్లు
రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలను వెల్లడించిన
మంత్రి టి.బి.జయచంద్ర
బెంగళూరు: తుమకూరు సమీపంలోని వసంతనరసాపుర ప్రాంతంలో ‘ఇంటిగ్రేటెడ్ మిషన్ టూల్ పార్క్’ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి సమ్మతించింది. బుధవారమిక్కడి విధానసౌధలో సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర మీడియాకు వివరించారు. బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను చిత్రదుర్గ వరకు విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు-చెన్నై-చిత్రదుర్గ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ఈ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇక ఈ టూల్ పార్క్ ఏర్పాటు కోసం ఓ ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసి దానిని రిజిస్టర్ చేయించనున్నామని చెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.125కోట్లను అందజేయనుందని వివరించారు. ఈ టూల్ పార్క్ ఏర్పాటు ద్వారా 4 వేల మందికి ఉపాధి లభించనుందని, రూ.380కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి టి.బి.జయచంద్ర మీడియాకు వివరించారు. బెంగళూరు-చెన్నై కారిడార్‌ను చిత్రదుర్గ వరకు పొడిగించిన నేపథ్యంలో ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు మొత్తం రూ.481కోట్లను మంజూరు చేసేందుకు మంత్రి మండలి నిర్ణయించిందని తెలిపారు.
మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు....
►హల్లెకరికట్టె గ్రామంలో అతివృష్టి నిధులతో రోడ్లు వేయించిన సందర్భంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పీడబ్ల్యూడీ ఇంజనీరు అశోక్ ఎం.బుగిలిని నిర్భంద పదవీ విరమణ ఇచ్చేందుకు మంత్రి మండలి నిర్ణయించింది. రోడ్లు వేయించిన పనుల్లో రూ.4 లక్షల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు బుగిలిపై వచ్చిన నేపథ్యంలో ఉప లోకాయుక్త విచారణ చేపట్టి అక్రమాలు నిజమేనని తేల్చింది. ఆయన్ను ఉద్యోగ బాధ్యతల నుండి తప్పించాలని సఫార్సు చేసింది. దీంతో బుగిలికి నిర్భంద పదవీ విరమణ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.
►ఉడుపి జిల్లాకు చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ బి.ఆర్.శెట్టర్ తన తల్లి పేరిట ఉడుపిలోని ప్రభుత్వ ఆస్పత్రిని లీజుకు తీసుకొని రూ.200కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేందుకు ప్రిన్సిపల్ క్లియరెన్స్ ఇచ్చారు.
►గదగ్-హంబాళ రైల్వే మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు మంత్రి మండలి అంగీకరించింది. రూ.23 కోట్ల వ్యయం కాగల ఈ పనులకు 50శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.50శాతం రైల్వే శాఖ భరించనుంది.
►కల్బుర్గి జిల్లా చించోళ్ తాలూకాలోని కాగిన నదిపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మాణానికి రూ.26.26కోట్లు మంజూరు
►వచ్చే ఏడాది జనవరి 7నుంచి 9 వరకు జరగనున్న ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహణకు రూ.20కోట్ల మంజూరు.
►సుత్తూరు ప్రాంతంలోని కబిని నది నుంచి ఎత్తిపోతల ద్వారా నంజనగూడు, యల్లందూరు, చామరాజనగర ప్రాంతాలకు తాగునీటిని అందజేయడంతో పాటు అక్కడి చెరువులను నింపేందుకు అంగీకారం. ఇందుకు రూ.233 కోట్లు విడుదల
► వివిధ కేంద్ర పథకాల కింద రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలుగా రూ.836 కోట్లను వచ్చే ఏడాది బడ్జెట్లో పొందుపరిచేందుకు నిర్ణయించారు.