ఓయూసెట్లో 93.98 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పీజీ, పీజీడిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఓయూసెట్-2015 ఫలితాలు వెల్లడయ్యాయి. ఉస్మానియా వర్సిటీలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ సోమవారం వీటిని విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి 16 వరకు నిర్వహించిన ఓయూసెట్కు 88,417 మంది హాజరుకాగా.. ఇందులో 83,098 మంది (93.98 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 52 సజ్టెక్టులకు గాను 44 సబ్జెక్టులకు మాత్రమే పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించారు. కాగా ఎంపీఈడీ కోర్సు ఫలితాలు వెల్లడించాల్సి ఉంది.
కన్నడ, పర్షియన్, తమిళ్, మరాఠి తదితర సబ్జెక్టుల్లో ఉన్న సీట్ల కంటే దరఖాస్తులు తక్కువ సంఖ్యలో రావడంతో పరీక్ష నిర్వహించలేదు. ఆ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్న అందరికీ నేరుగా అడ్మిషన్లు కల్పించనున్నట్లు అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్లో భాగంగా వచ్చే నెల 8 లేదా 9 నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరికేషన్కు హాజరయ్యే విద్యార్థులు విద్యార్హత పత్రాలతోపాటు తప్పనిసరిగా ర్యాంకు కార్డు తీసుకెళ్లాలని, లేకుంటే అనుమతించబోమని స్పష్టం చేశారు.