రాష్ట్రపతి పర్యటన.. ముమ్మర తనిఖీలు
తిరుమల: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చిత్తూరు పర్యటన నేపథ్యంలో తిరుమలలో యంత్రాంగం అప్రమత్తమైంది. 2300 మందితో ముందస్తుగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసి.. ముమ్మర తనిఖీలు చేపట్టారు. నేడు తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ముందుగా తిరుచానూరు వెళ్లి అక్కడ పద్మావతీ అమ్మవారిని దర్శించుకుంటారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 1.35గంటలకు శ్రీవరాహస్వామిని దర్శించుకుని, మహాద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. తిరుమలేశుని దర్శనానంతరం తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 4.10గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు పయనమవుతారని అధికార వర్గాల సమాచారం. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు తిరుమల లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టి.. పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
పుత్తూరు, నెల్లూరు వైపు నుంచి వచ్చి వెళ్లే బస్సులు రేణిగుంట మీదగా రామానుజసర్కిల్, పూర్ణకుంభం సర్కిల్ మీదగా ఆర్టీసీ బస్టాండ్‌కు అనుమతిస్తారు.
చిత్తూరు, బెంగళూరు, మదనపల్లి నుంచి వచ్చే వెళ్లే బస్సులు పూర్ణకుంభం, టీఎంఆర్ జంక్షన్, లీలామహల్ సర్కిల్, నంది జంక్షన్, గరుడా సర్కిల్, ఎస్వీ జూపార్క్ మీదగా చెర్లోపల్లి నుంచి అనుమతిస్తారు.
చంద్రగిరి, రంగంపేట వైపునకు వెళ్లే తిరుపతి షేర్ ఆటోలు చెర్లోపల్లి జంక్షన్ నుంచి తుమ్మలగుంట ఉప్పరపల్లి క్రాస్, వైకుంఠపురం ఆర్చ్ నుంచి అనుమతిస్తారు.
మరోవైపు తిరుమల శ్రీవారి సన్నిధిలో బుధవారం ఉదయం రద్దీ కొనసాగుతోంది. నేటి ఉదయం 7 గంటల సమయానికి 23 కంపార్టుమెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లోనే పూర్తవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.