బైపీసీలో కోతలకు చెల్లు
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్ : బైపీసీ గ్రూపు చదివే విద్యార్థులు జీవులను కోసి ప్రయోగాలు చేసే పద్ధతికి ఇంటర్మీడియట్ బోర్డు స్వస్తి పలికింది. 2014 వార్షిక ప్రయోగ పరీక్షల నుంచే దీన్ని అమలు చేయనుంది. వచ్చే ఏడాది నుంచి తరగతి గదుల్లోనూ జీవులను కోయరాదని, నమూనాలతో విద్యార్థులకు వివరించాలని ఆదేశాలు జారీ చేసింది. జీవుల శరీర నిర్మాణం, అవయాల అమరికపై ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కప్ప, బొద్దింక, వానపాము లాంటి చిన్న జీవులను కోసి ప్రయోగ పరీక్షలు నిర్వహించేవారు. ఈ ఏడాది జిల్లాలో 18 వేల మంది, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దాదాపు 1050 వరకు విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలకు హాజరుకానున్నారు.
రైతులకు మేలు చేసే వానపాములను ప్రయోగ పరీక్షల సమయంలో వేల సంఖ్యలో కోయాల్సి ఉంది. నీటి వనరులలో క్రిమికీటకాలను తిని కాలుష్యాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషించే కప్పలు కూడా చనిపోవాల్సి వస్తుంది. ప్రయోగాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. జీవవైవిద్యానికి ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు, జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపద్యంలో జీవుల కోత ప్రయోగాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రజ్ఞాకళాశాల ప్రిన్సిపాల్ హేమలత న్యూస్‌లైన్ తో వివరించారు.
ఇక నమూనాలే దిక్కు
ఇంటర్మీడియట్ జంతుశాస్త్ర ప్రయోగాల్లో మార్పులు చేసిన నేపథ్యంలో ఆ అంశాలపై విద్యార్థులకు అవగాహన, పరీక్షల నిర్వహణకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని కళాశాలలకు ఆదేశాలు వచ్చాయి. అవయాలను పోలిన కృత్రిమ నమూనాలతో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రయోగ పరీక్షలో వానపాము, బొద్దింక, కప్ప నమూనాలు పరిశీలించి పలు భాగాల పటాలు గీసి అవయవాలను గుర్తించాల్సి ఉంటుంద ని ఆదేశాలు కళాశాలకు అందాయి.