గం'ధర'గోళం
కర్నూలు : పంట రుణాలపై వడ్డీ మాఫీ పథకం అమలులో సందిగ్ధం నెలకొంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు పంట రుణాలపై రూ. లక్ష వరకు వడ్డీమాఫీ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించి అమలు చేశారు. ఆ తరువాత ఎన్నికలు సమీపించడం, అధికారంలోకి వచ్చాక రుణ విముక్తి కల్పిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించడంతో రైతులెవ్వరూ రుణాలు చెల్లించ లేదు. ఫలితంగా 2013-14లో తక్కువ మంది మాత్రమే వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకున్నారు.
వాస్తవానికి రుణం తీసుకున్న ఏడాదిలోపు చెల్లిస్తే రూ. లక్ష వరకు వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. రూ. 3 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్నా వడ్డీ మినహాయింపు రూ. లక్ష వరకు వర్తిస్తుంది. మిగిలిన మొత్తానికి బ్యాంకు నిబంధనల ప్రకారం 7 శాతం వడ్డీ చెల్లించాలి. చంద్రబాబు మాటలు నమ్మి రైతులెవ్వరూ రుణాలు చెల్లించకపోవడంతో వడ్డీ రాయితీ రాకపోగా.. ఏడాది దాటితే ఎలాంటి తగ్గింపులు లేకుండా 12 శాతం నుంచి 14 శాతం వరకు వడ్డీని బ్యాంకులు ముక్కుపిండి వసూలు చేస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
రైతన్నల సంశయం..
2013 డిసెంబరు 31కు ముందు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకొని 2014 మార్చి 31 నాటికి ఉన్న బకాయిలకు మాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నిర్దిష్ట తేదీలలో రుణాలు తీసుకొని తర్వాత రుణాలు చెల్లించినా అప్పటి రుణాలకు మాఫీ వర్తిస్తుందని ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పటికే ఏడాది గడువు దాటిపోవడంతో అధిక శాతం మంది రైతులు వడ్డీ మాఫీ పథకం ద్వారా ప్రయోజనం పొందలేకపోయారు.
ఈ నేపథ్యంలో రుణాలు చెల్లించి మళ్లీ తీసుకోవడం ద్వారా వడ్డీ భారం తగ్గుతుందని రైతులు భావిస్తున్నారు. అయితే వడ్డీ మాఫీ పథకం అమలుపై ప్రభుత్వం నుంచి తమకు మార్గదర్శకాలు అందలేదని బ్యాంకు అధికారులు చెప్పడం రైతన్నలను నిరాశకు గురిచేస్తోంది. వడ్డీ మాఫీ కొనసాగితే పాత బకాయిలు ఏదోలా చెల్లించి వడ్డీ లేని రుణాలు సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నారు. దీనిపై బ్యాంకుల నుంచి స్పష్టమైన సమాధానం లభించకపోవడంతో రుణాలు చెల్లించినా వడ్డీమాఫీ వర్తించదేమో అనే అనుమానం రైతులను వెంటాడుతోంది.
రైతును చేరని రుణం..
ఇదిలా ఉండగా.. వ్యవసాయ అనుబంధ రుణాలతో కలిపి 2014-15లో జిల్లాలో రూ. 3,700 కోట్లు పంట రుణాలు (వ్యవసాయ భూములు, బంగారు ఆభరణాలపై) ఇవ్వాలని బ్యాంకులకు లక్ష్యం నిర్దేశించారు. బ్యాంకర్లకు, ప్రభుత్వం నిర్దేశించిన రుణ లక్ష్యానికి.. రైతుకు అందిన రుణ మొత్తానికి
పొంతన లేదు. తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణం అందుతుందన్న ఆశతో రైతన్న ఉంటే.. బ్యాంకర్లు మాత్రమే అనేక సాకులు చూపుతూ కాలం గడిపేశారు.
2014-15 ఆర్థిక సంవత్సరం దాదాపు పూర్తవుతోంది. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు పెట్టుబడి అందకపోవడంతో నిర్దేశించిన లక్ష్యంలో 35 శాతం కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రూ. 2,888 కోట్ల మొత్తాన్ని వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ సాకుగా చూపి బ్యాంకర్లు కొత్త రుణాల జారీని దాదాపు నిలిపేశారు. రూ. 500 కోట్ల మొత్తాన్ని కూడా ఇవ్వలేదు. పోనీ, రబీలో రుణాలు ఇచ్చి రైతులను ఆదుకున్నారా? అంటే ఒక్కపైసా విదల్చలేదు. బ్యాంకర్ల రికార్డుల ప్రకారం ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రూ. 435 కోట్లను మాత్రమే ఇచ్చారు. అంటే నిర్దేశిత లక్ష్యంలో 33 శాతం కూడా వ్యవసాయ రుణాలుగా బ్యాంకర్లు ఇవ్వకపోవడం గమనార్హం.
మార్గదర్శకాలు వస్తేనే..
వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ 2013-14 సంవత్సరానికి కూడా కొనసాగుతుందని వ్యవసాయశాఖ కమిషనర్.. ఎస్ఎల్బీసీ కన్వీనర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 2014-15 ఖరీఫ్, రబీ రుణాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల నుంచి బ్యాంకులకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. వ్యవసాయశాఖ కమిషనర్ లేఖ రాసినా నిధులకు సంబంధించి బడ్జెట్లో ప్రతిపాదనలు లేకపోవడం, నిర్వహణ మార్గదర్శకాలు లేనందున అమలు చేయలేని స్థితిలో ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి పావలా వడ్డీ, వడ్డీలేని రుణాల అమలుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు త్వరితగతిన విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మాఫీ అమలుపై ఆశతో సకాలంలో రుణాలు చెల్లించని రైతులకు కొంతైనా ఉపశమనం కలుగుతుంది.