'హైదరాబాద్ ఉండగా.. విజయవాడ ఎందుకు?'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ తాత్కాలిక రాజధాని ఉండగా, విజయవాడను ప్రకటించడం వెనుక ఆంతర్యమేమిటని రాయలసీమ రాజధానిసాధనకమిటీ కన్వీనర్ జస్టిస్ లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు. తాత్కాలిక రాజధాని మార్చాలనుకుంటే అన్ని వసతులున్న కర్నూలులో ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్లో ఉండటానికి పదేళ్ల గడువు ఉన్నా, తాత్కాలిక రాజధానిని మారిస్తే హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రుల్లో అభద్రతాభావం పెరుగుతుందని జస్టిస్ లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా తాత్కాలిక రాజధాని ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపారు. టీడీపీలోని కొందరు వ్యక్తులకు ఆర్ధిక లాభం చేకూర్చడానికే తాత్కాలిక రాజధానిని మారుస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తాత్కాలిక రాజధానిగా ఉండగా, మరో తాత్కాలిక రాజధాని ఎందుకంటూ బొత్స ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా, ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని, తాత్కాలిక రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తూ లేఖ రాస్తామని బొత్స అన్నారు.