రైట్ రైట్..
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
{పైవేట్ బస్సులకు కాస్త ఊరట
రోడ్డెక్కిన ప్రైవేట్ బస్సులు
ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు
సరుకు వాహనాలకు తప్పని పన్ను పోటు
విశాఖపట్నం: తెలంగాణవైపు వాహనాలు ఎట్టకేలకు బుధవారం కదిలాయి. ప్రయాణికులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. తెలంగాణలో ప్రవేశం కోసం అంతరాష్ట్ర పన్ను చెల్లించాలని అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి నుంచి ఏపీ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ప్రైవేట్ బస్సులను ఆపివేశారు. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాహన యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కోర్టును ఆశ్రయించిన ఆపరేటర్లు పన్నులు చెల్లిస్తామని హామీ పత్రాలు ఇస్తే సరిపోతుంది. ఈనెల 7న విచారణ అనంతరం పన్ను చెల్లింపుపై ప్రకటన ఉంటుందని కోర్టు తెలపడంతో బస్సుల ఆపరేటర్లు విశాఖలో బుకింగ్‌లు తెరిచారు. సరుకు వాహనాలపై ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో లారీలు, ట్రాలర్లు, ఆయిల్ ట్యాంకర్లు విశాఖ నుంచి తెలంగాణాలోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపడం లేదు. విశాఖ నుంచి ఆయా ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల నుంచి వేలాది టన్నులుగా స్టీల్ ప్లాంట్ ఐరన్, ఎరువులు, బొగ్గు, పోర్టుల నుంచి ముడి సామాగ్రి తెలంగాణా జిల్లాలకు సరఫరా అవుతోంది. తెలంగాణాలోని వివిధ సిమెంట్ ఫ్యాక్టరీలకు స్లాగ్, తదితర సామాగ్రి వెళ్తోంది. సరుకు రవాణా గణనీయంగా తగ్గింది. టన్ను కిరాయిలో మార్పులేకపోవడంతో పన్ను అదనపు భారంగా భావిస్తోన్న యజమానులు వాహనాలను పంపించడంలేదు.
దరలు ఇలా ఉండవచ్చు...
నేషనల్ పర్మిట్ ఉన్న లారీలు, భారీ తరహా వాహనాలకు అనుమతి ఉంటుంది. రాష్ట్ర పరిధి గల పర్మిట్లకు తెలంగాణాలోకి ప్రవేశం కోసం పర్మిట్ రుసుం చెల్లించాలి. కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులకు ప్రస్తుతం ఒక్కో సీటుకు రూ.2,650 ఉండగా ఇకపై అదనంగా దాదాపు వెయ్యి రూపాయలు పెరగనుంది. లారీలకు టన్నుల సామర్థ్యం, యాక్సిల్ సంఖ్యను బట్టి కనిష్టంగా పది టన్నుల లారీకి రూ.1,500 గరిష్టంగా ఐదు యాక్సిల్ వాహనాలకు రూ.6,500 తెలంగాణాలో పన్ను విధించవచ్చు. నేషనల్ పర్మిట్ కలిగి ఉంటే రాష్ట్రంలో ప్రవేశం కోసం మెకానికల్, యూజర్, సర్వీస్ ఛార్జీలుగా రూ.500 నుంచి రూ.1,500 వసూలు చేయవచ్చు. త్రైమాసిక పన్నుల చెల్లింపు వాహనం రిజిస్ట్రేషన్ కాబడ్డ రాష్ట్రానికి పరిమితం కాగా అంతరాష్ట్ర వాహనాలకు ఆయా రాష్ట్రాల నిబంధనల ప్రకారం సరిహద్దులలో ఛార్జీలు వసూలు చేస్తారు.
ఆర్టీసీకి పెరిగిన గిరాకీ...
విశాఖ నుంచి హైద్రాబాద్‌కు ప్రైవేట్ టావెల్స్ ద్వారా దాదాపు 40 సర్వీసులు నడుస్తున్నాయి. ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు రాకపోకలకు వెనక్కి తగ్గడంతో మంగళ, బుధవారం ఆర్టీసీకి గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం హైద్రాబాద్‌కు మూడు వాల్వో, మూడు ఐదు లగ్జరీ, సెమి లగ్జరీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఆర్టీసీ నడుపుతోంది. బుధవారం అదనంగా ఒక వాల్వో, మూడు లగ్జరీ బస్సులను ఆర్టీసీ ఏర్పాటుచేసింది. టికెట్ ధరలో ఎటువంటి మార్పులు లేకుండా ఆర్టీసీ ప్రయాణికులను ఆహ్వానించింది.
నేషనల్ పర్మిట్‌తో కాస్త ఊరట...
\సరుకులతో ప్రయాణించే నేషనల్ పర్మిట్ వాహనాలకు కాస్త ఊరట లభిస్తోంది. నేషనల్ పర్మిట్ కలిగి ఉన్న వాహనాలు ఆయా రాష్ట్రాలలోకి ప్రవేశించవచ్చు. కొన్ని రాష్ట్రాలలో మెకానికల్ ఛార్జీలు నామమాత్రంగా చెల్లించి రాకపోకలు చేయవచ్చు. తెలంగాణాలో పర్మిట్ కోసం పన్నులు చెల్లించాలని ఆంక్షలు ఉండటంతో నేషనల్ పర్మిట్ గల వాహనాలను అనుమతిస్తారు.
లారీ ఆపరేటర్ల ఖండన
తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశం కోసం ప్రవేశపెట్టిన పన్నుల విధానం విరమించుకోవాలని ది విశాఖపట్నం లారీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పీలా అప్పలరాజు, కోరుకొండ అర్జున్ డిమాండ్ చేశారు. పెరిగిన టోల్ ఛార్జీలు, వాహన పన్నులు, భీమా, ఇంధనం ధరలతో రవాణా రంగం ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైద్రాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండగా తెలంగాణా ప్రభుత్వం వాహనాలకు పన్నులు విధించడం సబబుగా లేదన్నారు. వాహనాల నుంచి పన్నులు రాబట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించడాన్ని విమర్శించారు.