రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
►హాజరుకానున్న 21,743 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు
►122 కేంద్రాల ఏర్పాటు
నెల్లూరు (విద్య): ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు ఈనెల 12వ తేదీ (గురువారం) నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మార్చి 4వ తేదీ వరకు ఇవి 4 దశల్లో నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే డీఈసీ, హైపవర్ కమిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. ప్రాక్టికల్స్ నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 122 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 23 ప్రభుత్వ కాలేజీలు, 2 ఆదర్శపాఠశాలలు, 8 ఎయిడెడ్ కళాశాలలు, 2 ఏపీటీడబ్ల్యూ రెసిడెన్షియల్ కళాశాలలు, ఏపీఆర్జేసీ కళాశాల-1, ఏపీఎస్‌డబ్ల్యూ కాలేజీలు-9, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలలు-77 ఉన్నాయి. మొత్తం 21,743 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు.
ఒకేషనల్ కోర్సులుండే కళాశాలల్లో మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు సమాంతరంగా ప్రాకిక్టల్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతాయి.
కమిటీల ఏర్పాటు
పరీక్షల కోసం ఆర్ఐఓ (రీజనల్ ఇంటర్మీడియట్ అధికారి) ఆధ్వర్యంలో పలు కమిటీలను వేశారు. పరీక్షల నిర్వహణకు, పర్యవేక్షణ కోసం డీఈసీ (జిల్లా నిర్వహక కమిటీ) వేశారు. దీనికి ఆర్ఐఓ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రైవేటు కళాశాలలు కేంద్రాలుగా ఉన్నచోట పరీక్షలు సజావుగా జరిపేందుకు లెక్చరర్స్‌ను డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌చే హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. పరీక్షల గురించి కలెక్టర్‌తో సంప్రదింపులు చేసేందుకు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా ఏజేసీని నియమించారు.
రీవెరిఫికేషన్‌కు అవకాశం
ప్రాక్టికల్స్‌లో 27 నుంచి 30 మార్కులు పొందిన విద్యార్థులు రీవెరిఫికేషన్ చేసుకొనేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అవకాశం కల్పించారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
నెల్లూరులోని ఆర్ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటుచేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కంట్రోల్ రూం నంబర్: 0861-2320312.