భారీగా తగ్గిన ఇంటర్ పుస్తకాల ధరలు!
ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పుస్తకాల ధరలు భారీగా తగ్గాయి. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో పుస్తకాల నాణ్యత పేరుతో ధరలను విపరీతంగా పెంచిన అధికారుల వైఖరితో తెలుగు అకాడమి తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన పలుమార్లు చర్చించి పుస్తకాల ధరలు తగ్గించాలని నిర్ణయించారు.
మరోవైపు పుస్తక విక్రేతలు ఇప్పటికే పాత ధరలతో కొనుగోలు చేసిన పుస్తకాల ధరలను కూడా తగ్గించి... వారు ఎక్కువగా చెల్లించిన సొమ్ము మేరకు అదనంగా పుస్తకాలను ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఇతర వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని పుస్తకాల ధరలు తగ్గుతున్నాయి.