తుది గడువు డిసెంబరు15
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది కాలంగా నిషేధంలో కొనసాగుతున్న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. అవినీతి మచ్చ పడిన వారు క్రీడా సంఘాల్లో కొనసాగేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని తేల్చి చెప్పింది. తాజా పరిణామాలకు సంబంధించి ఐఓఏ తాత్కాలిక అధ్యక్షుడు విజయ్‌కుమార్ మల్హోత్రాతో పాటు సస్పెండ్ అయిన ఐఓఏ సభ్యులకు ఐఓసీ డెరైక్టర్ జనరల్ క్రిస్టోఫ్ కీపర్ ఒక లేఖ రాశారు. దీని ప్రకారం చార్జ్‌షీట్‌లో పేర్లు ఉన్న సభ్యులందరినీ అక్టోబరు 31లోగా తొలగించాలని ఆదేశించింది. ఆ తర్వాత ఐఓసీ నిబంధనల ప్రకారం డిసెంబర్ 15లోగా ఎన్నికలు జరపాలని పేర్కొంది. అప్పుడే భారత్ గుర్తింపును పునరుద్ధరించే విషయంపై ఆలోచిస్తామని ఐఓసీ స్పష్టం చేసింది.
మీ ఇంటినుంచి వెళ్లిపో!
ఒలింపిక్స్‌లో ఏకైక వ్యక్తిగత స్వర్ణం సాధించిన స్టార్ షూటర్ అభినవ్ బింద్రాపై ఐఓఏ మాజీ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా అక్కసు వెళ్లగక్కారు. ఒలింపిక్ సంఘంలో అవినీతిపరులను దూరంగా ఉంచాలంటూ ఉద్యమిస్తున్న బింద్రాపై ఆయన వ్యక్తిగత దూషణకు దిగారు. అభినవ్ తండ్రి ఏఎస్ బింద్రా నాలుగేళ్ల క్రితం ఆర్థిక అవకతవకలపై అరెస్టుకు గురైన విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘చార్జ్‌షీట్ ఎదుర్కొంటున్నవారిని ఐఓఏ నుంచి బయటికి పంపించాలని అభినవ్ బింద్రా భావిస్తున్నారు. అదే నిజమైతే ఆయన తన తండ్రిని ముందు సొంత ఇంటినుంచి బయటికి పంపించాలి లేదా తానే స్వయంగా వెళ్లిపోవాలి’ అని చౌతాలా తీవ్ర వ్యాఖ్య చేశారు.