మెరిసిన చిత్రం
ప్రతి గీత సంస్కృతికి రూపం. ప్రతి చిత్రం భారతీయతను చాటే రూపం. ‘ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా’ను అద్భుతమైన బొమ్మల్లో చూపి... అంతర్జాతీయ ఖ్యాతి గడించారు నగర విద్యార్థులు. బంగ్లాదేశ్‌లోని ‘బంగ్లాదేశ్ శిశు అకాడమీ’ ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆర్ట్
ఎగ్జిబిషన్లో మనోళ్ల చిత్రాలకు బహుమతులు వరుస కట్టాయి. పేదింటి నుంచి వచ్చిన అమర్నాథ్ (ఇంజనీరింగ్), కుమారి సోనీ, సందీప్ కుమార్ (బీఎఫ్ఏ), శ్రీనిధి (8వ తరగతి)లు చూపిన అద్వితీయ ప్రతిభకు కాంస్య పతకాలు దక్కాయి. మరో పదహారు మంది చిన్నారులకు ‘హానరబుల్ మెన్షన్’ సర్టిఫికెట్లు వచ్చాయి. అత్తాపూర్ ‘యంగ్ ఎన్వాయస్ ఇంటర్నేషనల్’ ఆర్ట్ స్కూల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం అధికారి ఇనముల్ హక్వీచౌదరి విద్యార్థులకు ఈ బహుమతులు అందించారు. వీరంతా ఈ స్కూల్ విద్యార్థులే కావడం విశేషం.
భారత్‌లో పెళ్లి తంతుపై వివిధ భంగిమల్లో వీరు గీసిన చిత్రాలు అక్కడ అందర్నీ మంత్రముగ్ధులను చేశాయి. మన దేశం నుంచి ఈ ఎగ్జిబిషన్లో బహుమతులు గెలుచుకున్నది కూడా వీరే. దీనిపై విద్యార్థులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘వీరి ఆర్ట్ అద్భుతం. వారిని మరింతగా ప్రోత్సహించాలనే బహుమతులు ఇవ్వడానికి స్వయంగా వచ్చా’ అన్నారు హక్వీచౌదరి.
వీఎస్