భారత్ వృద్ధి 7.5 శాతాన్ని మించుతుంది
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ...
కౌలాలంపూర్: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్నప్పటికీ.. భారత్ వెలుగు రేఖలా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుత దేశ ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం వృద్ధి రేటును నమోదుచేస్తోందని.. రానున్న సంవత్సరాల్లో వృద్ధి మరింత పరుగులు తీయనుందని ఆయన చెప్పారు. మూడు రోజుల మలేసియా పర్యటనలో భాగంగా ఆదివారమిక్కడ జరిగిన ఒక సమావేశంలో మోదీ మాట్లాడారు.
‘ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలుస్తోంది. అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాలు ఇక్కడ పెట్టుబడులకు తరలివస్తున్నాయి. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 18 నెలల్లో ప్రభుత్వ విధుల్లో పూర్తిస్థాయి మార్పులను తీసుకురాగలిగాం. పారదర్శకంగా, జవాబుదారీగా తీర్చిదిద్దాం.
అన్నిస్థాయిల్లోనూ అవినీతిని నిర్మూలించేందుకు నడుంబిగించాం. అంతేకాదు.. వ్యక్తిగత నిర్ణయాలతోకాకుండా, వ్యవస్థ.. పాలసీల ఆధారంగా పరిపాలన ఉండేవిధంగా చూస్తున్నాం’ అని మోదీ వివరించారు. ఆగ్నేయాసియా దేశాలతో భారత్కు చాలా సాన్నిహిత్యం ఉందని.. ప్రపంచంలోని అత్యంత శాంతియుతమైన, క్రియాశీలక ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తోందని కూడా ప్రధాని పేర్కొన్నారు.