ప్రభుత్వ మద్దతు ఉంటేనే చైనాతో పోటీపడగలం
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు చైనా సంస్థలకు దీటుగా విదేశాల్లో విస్తరించాలంటే ప్రభుత్వ మద్దతు అవసరమని భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ చెప్పారు. చైనా కంపెనీలకు ఆ దేశ ప్రభుత్వ సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. కానీ భారత్‌లోని కంపెనీలకు ఈ విషయంలో గతంలో ప్రభుత్వ మద్దతు అంతగా ఉండేది కాదని, కొత్త ప్రభుత్వమైనా దీనిపై దృష్టి పెట్టాలని మిట్టల్ సూచించారు.
దేశీ పారిశ్రామికవేత్తలు విదేశాల్లో ఎక్కడికి వెళ్లినా చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. ఇండియా గ్లోబల్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలపై తన అనుభవాలను పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం రాకతో పలు సానుకూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అయితే మరిన్ని చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అటు ఆఫ్రికాలో భారత్‌పై సానుకూల అభిప్రాయం ఉందని, అయితే చైనా కంపెనీల స్థాయిలో భారతీయ కంపెనీలు ఇన్వెస్ట్ చేయలేవన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ తోడ్పాటు అవసరమని ఆయన పేర్కొన్నారు.