‘సాక్షి’కి అంతర్జాతీయ గుర్తింపు
⇒ ప్రచురణలో ఉన్నత ప్రమాణాలకు దక్కిన గౌరవం
⇒ ఇంటర్నేషనల్ కలర్క్వాలిటీ క్లబ్లో సభ్యత్వం
⇒ ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 128 పత్రికలు
⇒ 65పత్రికలకు దక్కిన మెంబర్షిప్
⇒ ఈ ఖ్యాతి దక్కించుకున్న తొలి తెలుగు పత్రిక ‘సాక్షి’
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలుగువారి మనస్సాక్షి ‘సాక్షి’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. రాశిలో వాసిలో ఉన్నతప్రమాణాలను పాటిస్తున్న సాక్షి దినపత్రికకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ న్యూస్పేపర్ కలర్క్వాలిటీ క్లబ్ (ఐఎన్సీక్యుసి)లో ‘సాక్షి’కి సభ్యత్వం లభించింది. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి తెలుగుపత్రిక ‘సాక్షి’ కావడం విశేషం. ప్రింటింగ్లో అంతర్జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాలను క్రమం తప్పకుండా పాటించే వార్తాపత్రికలు, ప్రచురణా సంస్థల మధ్య పోటీ నిర్వహించి ఈ సభ్యత్వానికి ఎంపికచేస్తారు.
కొల్కతాలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో వరల్డ్ ప్రింటర్స్ ఫోరమ్, వాన్ ఇఫ్రా (జర్మనీ) డిప్యూటీ సీఈవో మన్ఫ్రెడ్ వెర్ఫెల్ చేతులు మీదుగా ‘సాక్షి’ ప్రతినిధులు ఈ సభ్యత్వ ధృవపత్రాన్ని అందుకున్నారు. వాన్ ఇఫ్రా ఇండియా 24వ వార్షిక సమావేశాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో అనేక అంతర్జాతీయ పత్రికల ప్రతినిధులు, వివిధ దేశాలకు చెందిన పలువురు మీడియా ప్రముఖులు పాల్గొన్నారు.
65 పత్రికలకు సభ్యత్వం
ప్రపంచవ్యాప్తంగా 128 పత్రికలు ఈ సభ్యత్వం కోసం పోటీపడ్డాయి. ఐఎన్సీక్యుసీ అంతర్జాతీయంగా ప్రింటింగ్లో ఉన్నతప్రమాణాలను పాటిస్తున్న పత్రికల మధ్య ప్రతి రెండేళ్లకొకమారు పోటీ నిర్వహించి తమ సంస్థలో సభ్యత్వం ఇస్తుంది. రెండేళ్ల (2016-2018) కాలానికి గాను ఈసారి 65 పత్రికలు ఎంపికయ్యాయి. ప్రింటింగ్ క్వాలిటీని నిరూపించుకోవడం కోసం ఈ పోటీలో పాల్గొనే పత్రికలు ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొనవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన మీడియా నిపుణులతో కూడిన జ్యూరీ ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది.
1994లో ప్రారంభమైన ఐఎన్సీక్యుసి అప్పటి నుంచి వార్తాపత్రికలు, ప్రచురణ సంస్థల మధ్య ‘కలర్ ప్రింటింగ్ క్వాలిటీ’ పోటీలు నిర్వహిస్తూ వస్తోంది. క్వాలిటీ ప్రింటింగ్లో ప్రపంచస్థాయి గుర్తింపు కోసం వార్తాపత్రికలు, ప్రచురణ సంస్థలు ఈ పోటీలో పాల్గొంటాయి. కొల్కతాలో జరిగిన సభ్యత్వ ప్రదానం కార్యక్రమంలో సాక్షి తరఫున పి.వి.కె.ప్రసాద్ (డెరైక్టర్, ఆపరేషన్స్), టి.కె.సురేష్ (సీజీఎం, ఆపరేషన్స్), బి.గౌరీశంకర్ (జీఎం, క్వాలిటీ అండ్ ప్రీప్రెస్) పాల్గొన్నారు.