దేశీ ఇంటర్నెట్ కాల్స్‌ను నియంత్రించాలి
కేంద్రానికి డాట్ సిఫార్సులు
న్యూఢిల్లీ : స్కైప్, వాట్సాప్, వైబర్ వంటి ఇంటర్నెట్ ఆధారిత యాప్స్ ద్వారా దేశీయంగా చేసే కాల్స్‌ను నియంత్రించాలని టెలికం శాఖ (డాట్) కమిటీ ప్రతిపాదించింది. ఇతర టెలికం ఆపరేటర్లు అందించే ఫోన్ కాల్ సర్వీసుల్లాగానే వీటిని కూడా పరిగణించాలని పేర్కొంది. మరోవైపు, సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్‌కి చెందిన ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ వంటి ప్రాజెక్టులను అనుమతించరాదని డాట్ కమిటీ సూచించింది. కానీ దాదాపు అదే తరహాలో ఉండే ఎయిర్టెల్ జీరో వంటి ప్లాన్స్‌ను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నుంచి ముందస్తు క్లియరెన్స్‌తో అనుమతించవచ్చని తెలిపింది.
ఓవర్-ది-టాప్ (ఓటీటీ) వీవోఐపీ ఇంటర్నేషనల్ కాల్స్ సర్వీసుల విషయంలో సరళంగా వ్యవహరించవచ్చని పేర్కొంది. దేశ భద్రత అత్యంత ప్రాధాన్యమైన అంశం గనుక ఓటీటీ సంస్థలను కూడా టెలికం ఆపరేటర్ల తరహాలోనే నియంత్రణ పరిధిలోకి తే వాలని డాట్ కమిటీ పేర్కొంది. నెట్ న్యూట్రాలిటీ వివాదంపై డాట్ సాంకేతిక సలహాదారు ఎ.కె. భార్గవ సారథ్యంలో ఏర్పాటైన కమిటీ ఈ మేరకు కేంద్రానికి సిఫార్సులు చేసింది. వీటిపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు, సూచనలు ఆగస్టు 15లోగా కమిటీకి తెలియజేయాల్సి ఉంటుంది.