మెహుల్ చోక్సీకి నో బెయిల్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా న్యాయస్థానం బెయిల్ మంజూరుకు నిరాకరించింది. అంటిగ్వా నుంచి తమ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన చోక్సికి బెయిల్ ఇవ్వలేమని గురువారం పిటిషన్ను కొట్టివేసింది. చోక్సీ(62) వీల్ చైర్లో కోర్టుకు హాజరయ్యారు. చోక్సీ అక్రమంగా డొమినికాకు రాలేదని, ఆయనని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని అందుకే బెయిల్ ఇవ్వాలంటూ చోక్సీ తరఫు లాయర్ వాదించారు.
మరోవైపు చోక్సీకి బెయిల్ ఇస్తే అతను పారిపోతాడని, భారత్లో ఆర్థిక నేరాలకు సంబంధించిన 11 కేసులు ఉన్నాయని, ఇంటర్పోల్ నోటీసులూ అతనిపై జారీ అయ్యాయని ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. చోక్సీ చుట్టూ ఉన్న పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉండడం వల్ల బెయిల్ ఇవ్వలేమని మెజిస్ట్రేట్ కేండియా కేరట్ జార్జ్ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో అక్రమంగా ప్రవేశించినందుకు వేసే జరిమానాకు రెట్టింపు మొత్తం 10 వేల కరీబియన్ డాలర్లు చెల్లిస్తామని చోక్సీ తరఫు లాయర్ చెప్పినా న్యాయమూర్తి అంగీకరించలేదు.
అయితే బెయిల్ కోసం పై కోర్టుకు వెళతామని లాయర్ విజయ్ అగర్వాల్ మీడియాకి వెల్లడించారు. వాదనల సమయంలో భారత్ నుంచి వెళ్లిన బృందం కోర్టుకి హాజరైంది. డొమినికా ప్రభుత్వం చోక్సీని అప్పగిస్తే భారత్కు తీసుకురావడానికి ఆ బృందం వెళ్లింది. అయితే ఇప్పుడిప్పుడే చోక్సీని అప్పగించే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులంటున్నారు. చోక్సీపై కోర్టుకు వెళితే మరిన్ని రోజులు ఈ కేసు సాగే అవకాశాలున్నాయి. 2018 నుంచి అంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ అక్కడ్నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అతను ప్రేయసితో విహార యాత్ర కోసం డొమినికాకు వెళ్లాడన్న ఆరోపణలున్నాయి. మే 23న తమ దీవుల్లోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారంటూ డొమినికా పోలీసులు చోక్సీని అదుపులోకి తీసుకున్నారు.
చోక్సీని వెనక్కి తెస్తాం: భారత విదేశాంగ శాఖ
మెహుల్ చోక్సీని కచ్చితంగా భారత్కు తీసుకువస్తామని విదేశాంగ శాఖ ధీమా వ్యక్తం చేసింది. డొమినికాలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయితే వెంటనే అతనిని భారత్కి తెస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బగ్చి చెప్పారు.
ఆ సమస్య మనకొద్దు
చోక్సీని డొమినికా నుంచే భారత్కు పంపిస్తే మంచిదని అంటిగ్వా, బార్బుడా దేశం భావిస్తోంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో చోక్సీ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ప్రస్తుతం చోక్సీ డొమినికా పోలీసు కస్డడీలో ఉన్నందున ఇది వాళ్ల వ్యవహారమని, ఇక్కడికి వస్తే ఆ సమస్యలు తమకు చుట్టుకుంటాయని సమావేశం అభిప్రాయపడింది.