ఇంటర్‌పోల్ సెక్రటరీ జనరల్ పదవి రేసులో సీబీఐ చీఫ్
న్యూఢిల్లీ: ఇంటర్‌పోల్ సెక్రటరీ జనరల్ పదవి రేసులో భారత్ తొలిసారి నిలిచింది. ఈ పదవికి పోటీపడుతున్న సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హాకు మద్దతు కూడగట్టాలని విదేశీ వ్యవహారాల శాఖను సీబీఐ కోరింది. ఈ అభ్యర్థనను ఆ శాఖ హోం మంత్రిత్వ శాఖకు పంపింది. ఇంటర్‌పోల్ సెక్రటరీ జనరల్ పదవికి పోటీపడేవారి తుది జాబితాను ఈనెల 16న ఫ్రాన్స్‌లోని లియాన్‌లో విడుదల చేస్తారని, దానిలో రంజిత్ సిన్హా చోటు దక్కించుకుంటున్నారని మంగళవారం అధికారులు తెలిపారు. సిన్హాతో పాటు యూరప్ నుంచి ముగ్గురు, ఆఫ్రికా, అమెరికా నుంచి ఒక్కొక్కరు చొప్పున బరిలో నిలవనున్నారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీలో అమెరికా, కెనడా, చిలీ, ఇటలీ, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, జపాన్, కొరియా, నైజీరియా, అల్జీరియా, రువాండా, ఖతార్ దేశాలకు చెందిన ప్రతినిధులు ఉంటారు. వీరికి ఫ్రాన్స్‌కు చెందిన మిరెల్లీ బల్లేస్ట్రాజీ నేతృత్వం వహిస్తారు. వీరి మధ్యన ఏకాభిప్రాయం రాకపోతే ఇంటర్‌పోల్‌లో ఉన్న 190 సభ్యదేశాల ప్రతినిధులతో ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ రొనాల్డ్‌నోబుల్ పదవీ కాలం వచ్చే ఏడాదితో ముగుస్తుంది.