సీబీఐది మతిలేని లాజిక్: భవే
ముంబై: తనపై ప్రాథమిక విచారణ(పీఈ)ను మొదలుపెట్టిన సీబీఐది పిచ్చి లాజిక్ అంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ మాజీ చైర్మన్ సీబీ భవే ఎదురుదాడికి దిగారు. ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్‌కు 2008లో లెసైన్స్ మంజూరు చేయడంపై సీబీఐ భవేపై పీఈ నమోదు చేసిన నేపథ్యంలో భవే ఇలా స్పందించారు. ఈ అంశానికి సంబంధించి కొన్నేళ్ల క్రితమే ఆదాయపన్ను(ఐటీ) శాఖ దర్యాప్తును ముగించడంతోపాటు, ఈ కేసులో ఎలాంటి విషయమూ లేదంటూ పేర్కొన్న విషయాన్ని భవే ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నిజాన్ని సీబీఐ విస్మరించడమేకాకుండా మతితప్పి వ్యవహరిస్తున్నదంటూ వ్యాఖ్యానించారు.
1975 బ్యాచ్‌కు చెందిన మాజీ మహారాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్ అయిన భవే రుజువులుంటే సీబీఐ తనపై తప్పకుండా విచారణను చేపట్టవచ్చునని చెప్పారు. రుజువులు చూపలేకపోతే తన గౌరవానికి భంగం కలిగించినందుకు పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్‌కు లెసైన్స్ మం జూరు చేయడంలో ప్రమోటర్ జిగ్నేష్ షా లబ్దిపొందారన్న అభియోగం అర్థంలేనిదని, నిజానికి ఇందువల్ల ఎక్స్ఛేంజీల మధ్య పోటీకి తెరలేపామని వివరించారు.
సీబీఐ విచారణ సరికాదు: పరేఖ్
మరోవైపు భవే లాంటి నిజాయితీ గల అధికారులపై సీబీఐ విచారణ చేపట్టడం సరికాదని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వపరంగా నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతుండగా.. దీని వల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశముందని చెప్పారు.