రేపటినుంచి మొయినుద్దౌలా టోర్నీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్‌కు చిరునామా అయిన ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ ఇన్విటేషన్ టోర్నమెంట్ నిర్వహణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సిద్ధమైంది. సోమవారం ప్రారంభమయ్యే ఈ టోర్నీ ఈ నెల 12 వరకు జరుగుతుంది. ఉప్పల్, జింఖానా, ఎన్ఎఫ్సీ, ఈసీఐఎల్ మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. హెచ్‌సీఏ తరఫున హైదరాబాద్, హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ పేర్లతో రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
వీటితో పాటు తమిళనాడు, కర్ణాటక, గోవా, కేరళ, ఢిల్లీ, సర్వీసెస్ జట్లు గోల్డ్ కప్‌లో పాల్గొంటున్నాయి. గత ఏడాది టోర్నీలో తమిళనాడు విజేతగా నిలిచింది. నాకౌట్ పద్ధతిలో మూడు రోజుల మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 90 ఓవర్లు ప్లస్ 40 ఓవర్ల ఫార్మాట్‌ను ఇందు కోసం నిర్ణయించారు. శనివారం నగరానికి చేరుకున్న ఢిల్లీ జట్టు జింఖానా మైదానంలో ప్రాక్టీస్ చేసింది. గత రెండు సీజన్ల పాటు హైదరాబాద్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సునీల్ జోషి ఈ టోర్నీతో కోచ్‌గా మరో సీజన్‌ను ప్రారంభించనున్నారు.