‘ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయండి’
ముంబై: ముస్లిం యువకులపై నమోదైన ఉగ్రవాద కేసుల విచారణ కోసం ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని జమాయత్ ఉలేమా ఇ హింద్ సంస్థ డిమాండ్ చేసింది. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనే అంశంపై ఆజాద్ మైదాన్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆ సంస్థ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మద్ని ప్రసంగించారు. ఉగ్రవాద కేసుల్లో చిక్కుకున్న ముస్లిం యువకుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఇది ఆందోళనకరమైన విషయమన్నారు. మైనారిటీల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద కేసుల్లో ముస్లిం యువకులు చిక్కుకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ఇటువంటి కేసుల్లో అమాయక ముస్లిం యువకులు అరెస్టవుతున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కూడా పేర్కొన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనేక ఉగ్రవాద కేసులకు సంబంధించి అనేక తీర్పులొచ్చాయని, ఆ కేసుల్లో చిక్కుకున్న ముస్లిం యువకులు విడుదలయ్యారని అన్నారు. అయితే ఇంకా కొంతమంది కారాగారాల్లోనే ఉన్నారని, ఆ నష్టాన్ని ఏవిధంగా పూడుస్తారంటూ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కేసుల ఉపసంహరణ విషయాన్ని రాష్ట్రప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అందువల్ల ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలన్నారు.