ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్లపై ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు
ముంబై: చెల్లింపుల విషయంలో విఫలమైన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) ప్రమోటర్లపై ఎన్ఎస్ఈఎల్ ఇన్వెస్టర్ ఫోరమ్ చైర్మన్ శరద్ సరాఫ్ ముంబైకి చెందిన ఆర్థిక నేరాల విభాగానికి(ఈవోడబ్ల్యూ) ఫిర్యాదు చేశారు. 58 మంది ఇన్వెస్టర్లు, 17 మంది బ్రోకర్లు, సభ్యులతో కూడిన ఫోరమ్ ఎన్ఎస్ఈఎల్, ఎక్స్ఛేంజీ ప్రమోటర్ జిగ్నేష్ షా, ఇతర ఎగ్జిక్యూటివ్‌లు అమిత్ ముఖర్జీ, జై భాఖుందీ, ఆడిటర్ ముకేష్ షాలపై ఈవోడబ్ల్యూ పోలీసుల వద్ద కేసును దాఖలు చేసినట్లు తెలిపింది.అంతేకాకుండా మరో 24 మంది చెల్లింపుల్లో విఫలమైన డిఫాల్టర్లు, తదితర క్లయింట్లపై కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. కాగా, ఎన్ఎస్ఈఎల్ కొత్త మేనేజ్మెంట్ టీమ్ ఇప్పటికే ఎక్స్ఛేంజీ మాజీ సీఈవో అంజనీ సిన్హాపై ఈవోడబ్ల్యూ వద్ద ఫిర్యాదును దాఖలు చేసింది.