'ఆ గ్యాంగ్‌లు కనిపిస్తే కాల్చిపారేయండి'
కర్నూలు: పొరుగున ఉన్న కర్ణాటకతోపాటు అనంపురం జిల్లా గుంతకల్లులో నివాసముంటున్న ఇరానీ బందిపోటు గ్యాంగ్‌లు హల్చల్ చేస్తున్నాయి. దోపిడీలు, దొంగతనాలతో రెచ్చిపోతున్న ఈ గ్యాంగులు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించడంతోనే కాల్చిపారేయాలని జిల్లా పోలీసులు గురువారం ఆదేశాలు ఇచ్చారు. ఇరానీ బందిపోటు గ్యాంగులకు సంబంధించి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీచేసినట్టు కర్నూలు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు.
ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. సుమారు ఐదు గ్యాంగ్‌లు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో సంచరిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ నేతృత్వంలో ఐదుగురు పోలీసులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చి ఆయుధాలతో గస్తీ విధులకు నియమించామని తెలిపారు. సీసీఎస్ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అనంతపురం, బళ్లారి ప్రాంతాల్లో దొంగల కోసం గాలిస్తున్నారన్నారు. నేర నివారణ కోసం సుమారు 70 మంది పోలీసులతో గస్తీ పెంచామని చెప్పారు.