ఇరాక్‌లో హోరాహోరీ
బాగ్దాద్: ఇరాక్‌లో మిలిటెంట్లకు, ప్రభుత్వ బలగాలకు మధ్య హోరాహోరీ ఘర్షణలు సాగుతున్నాయి. సిరియా సరిహద్దులోని వ్యూహాత్మక షియా పట్టణం తల్ అఫర్‌పై పట్టుకోసం సోమవారం ఇరు పక్షాలు భీకరంగా తలపడ్డాయి. మిలిటెంట్లు కొన్ని గంటలపాటు పట్టణంపై దాడి చేసి తల్‌అఫర్‌ను స్వాధీనం చేసుకున్నాయి. కాల్పులు, పేలుళ్లకు బెదిరిన స్థానికులు పెద్ద సంఖ్యలో వలస పోతున్నారు. పట్టణంలోని 2 లక్షల జనాభాలో సగం మంది పారిపోయారని, ఊరంతా మృతదేహాలు, క్షతగాత్రులతో భయానకంగా ఉందని స్థానిక అధికారి చెప్పారు.
తాము తిక్రిత్‌లో 1,700 మంది సైనికులను చంపేశామని, బాగ్దాద్ దిశగా ముందుకు సాగుతున్నామని మిలిటెంట్లకు నేతృత్వం వహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ (ఐఎస్ఐఎల్) జీహాదీ గ్రూప్ ప్రకటించింది. మరోపక్క.. సంక్షోభ పరిష్కారానికి అమెరికా, ఇరాన్‌లు చర్చలకు కసరత్తు ప్రారంభించాయి. ఇరాక్ హింసాకాండను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇరాక్‌లోని తమ పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నామని పేర్కొంది. ఇరాక్‌లో 10వేల మంది భారతీయు లు ఉన్నట్లు అంచనా. ఇరాక్‌లో పలువురు కేరళ నర్సులు సహా 86 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారంతా సురక్షితంగా ఉన్నారని భారత రాయబారి తెలిపారు.