పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్దాద్
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బాగ్దాద్‌లోని షాబ్ జిల్లాలోని గ్యారేజీలో పార్క్ చేసిన కారులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రత దళాలు క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని భద్రత దళాలు వెల్లడించాయి. అదే జిల్లాలో ప్రయాణికులతో వెళ్తన్న బస్సులో బాంబు పేలింది... ఈ ఘటనలో ఓ పౌరుడితోపాటు ఎనిమిది మంది మరణించారు.
ఇటీవల కాలంలో నగరంలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో ఇది ఒకటని భద్రత దళాల ఉన్నతాధికారి వెల్లడించారు. ఇరాక్‌లో తీవ్రవాదం, విధ్వంసం కారణంగా ఈ ఏడాది మొదటి ఆరునెలలో 5,576 మంది పౌరులు మరణించగా, 11,666 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో వెల్లడించింది.