నేడు ఐరావతంపై ఊరేగనున్న ఖాద్రీశుడు
కదిరి : ఖాద్రీ లక్ష్మీ నారసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు ఐరావతం(గజవాహనం)పై భక్తులకు శుక్రవారం దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల్లో జరిగే ప్రతి ఉత్సవంలో స్వామివారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చి, తిరిగి ఆలయంలోకి వెళ్తారు. అయితే ఐరావతంపై తిరువీధుల్లో దర్శనమిచ్చిన అనంతరం శ్రీవారు నేరుగా బ్రహ్మ రథోత్సవంపైకి చేరుకుంటారు. హిరణ్యకస్యపుడిని సంహరించిన నారసింహుడి ఉగ్రరూపాన్ని చూడలేని దేవతాగణం స్వామివారిని ప్రసన్నం కావాలని కోరగా అందుకు అనుగ్రహించిన నారసింహుడు ఐరావతంపై దర్శనమిస్తారు.
ఈ ఉత్సవం ముగిసిన మరుసటిదినమే లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న నృసింహుడి బ్రహ్మ రథోత్సవం. ఇప్పటికే భక్తులు శ్రీవారి రథోత్సవం ఆలయానికి చేరుకోవడంతో ఆ ప్రాంగణమంతా కాలుమోపేందుకు కూడా చోటు లేనంతగా భక్తులతో కిక్కిరిసిపోతోంది. గజవాహనోత్సవానికి ఉభయదారులుగా పబ్బిశెట్టి కుటుంబీకులు వ్యవహరిస్తారిని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, పాలక మండలి చైర్మన్ నరేంద్రబాబు తెలిపారు.