పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
కోసిగి: మండల పరిధిలోని ఐరన్‌గల్లు స్టేషన్లో గూడ్స్ రైలు బుధవారం పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల మేరకు.. గుంతకల్లు నుంచి కంకర లోడ్‌తో రాయచూర్‌కు వెళ్తున్న గూడ్స్ రైలు.. క్రాసింగ్ ఉండడంతో ఉదయం 7.30కు ఐరన్‌గల్లు రైల్వే స్టేషన్లో నిలిపేశారు. మరో రెండు అదనపు ఇంజన్లు ఉండడంతో వాటిని కూడా గూడ్స్ రైలుకు వెనుకభాగంలో జత చేసి రాయచూర్‌కు పంపించాలని నిర్ణయించారు. ఇంజన్లను గూడ్స్ వెనక భాగంలో రైల్వే గాడ్ పెట్టెకు జత చేసేసమయంలో డ్రైవర్ కాస్త వేగంగా కదిలించడంతో ఇంజన్ గాడ్ పెట్టెను ఢీకొంది. ఈ క్రమంలో గాడ్ పెట్టె చక్రాలు పట్టాల తప్పి కిందకు పడిపోయింది. గూడ్స్ గాడ్, సిబ్బంది కొద్ది దూరంలో ఉండడంతో ప్రమాదం తప్పింది. అనంతరం గుంతకల్లు నుంచి జాకీని తెప్పించి రైలు చక్రాలను పట్టాల పై సరిచేయడంతో గూడ్స్ రైలు యథావిధిగా రాయచూర్‌కు బయలుదేరింది.