సాగునీరిచ్చి చేలను బతికించండి
గుంపర్రు (యలమంచిలి) : బోరు నీటితో చేలకు ఎంత నీరు పెట్టినా ప్రయోజనం ఉండదని తప్పనిసరిగా కాలువ నీరు ఇచ్చి వరిచేలను బతికించాలని గుంపర్రు రైతులు ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ ఎం.త్రినాథ్రాజును కోరారు. రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. ఆయిల్ ఇచ్చి బోర్ల నుంచి ఎంత నీరు తోడినా పంటకు బలం చేకూరదని చెప్పారు. కనీసం 5 రోజులు ప్రత్యేక వంతు నడపాలని కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ రైతుల కోరిన విధంగా నీరు వదలమని శెట్టిపేట ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్‌ను ఆదేశించారు. ఆయన వెంట పశ్చిమ డెల్టా వాటర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పొత్తూరి రామాంజనేయరాజు, పాలకొల్లు వ్యవసాయ సహాయ సంచాలకులు పలివెల మురళీకృష్ణ, ఇరిగేషన్ డీఈ సీహెచ్ వెంకటనారాయణ, ఏఈ శ్రీనివాస్, ఏవో దొండపాటి జాన్సన్, గుంపర్రు, యలమంచిలి నీటి సంఘాల అధ్యక్షుడు పెచ్చెట్టి నాగేశ్వరరావు, ఆరిమిల్లి రామశ్రీనివాస్, ఏఈవో కలపాల ప్రవీణ్ ఉన్నారు.