అపోహలు వద్దు
- సీఎం సిద్ధరామయ ఎత్తిన హొళె అమలుకు కట్టుబడి ఉన్నాం
- వేమగల్ పారిశ్రామిక వాడలో పలు కర్మాగారాలకు శంకుస్థాపన
కోలారు : ఉభయ జిల్లాలకు శాశ్వత నీటి పారుదల సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎత్తినహొళె పథకంపై ఎలాంటి అపోహలు వద్దని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కోలారు తాలూకాలోని వేమగల్ పారిశ్రామిక వాడలో గ్లాక్సో స్మిత్లైన్ ఫార్మాసూటికల్, టాటా పవర్ ఎస్ఈడీ, శివం మోటార్ కంపెనీలకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. కోలారు జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, జిల్లా వాసులు పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నారని అన్నారు. కోలారు జిల్లాకు శాశ్వత నీటి పారుదల సౌకర్యాలను కల్పించడం ద్వారా ఈ సమస్యను అధిగమించనున్నట్లు చెప్పారు. ఎత్తినహొళె పథకం కోసం బడ్జెట్లో రూ. 13 వేల కోట్లను కేటాయించినట్లు గుర్తు చేశారు. వచ్చే ఏడాది మరో వెయ్యి కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని 30 జిల్లాలపైకి 27 జిల్లాల్లో కరువు తాండవిస్తోందని, 135 తాలూకాలలో వర్షాభావ పరిస్థితులు నెలకొందని అన్నారు. కోలారు జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి కేసీ వ్యాలీ నుంచి శుద్ధీకరించిన నీటిని చెరువులకు మళ్లించనున్నట్లు వివరించారు. దీని వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని అన్నారు. కర్ణాటకలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఉండడం వల్ల పరిశ్రమల స్థాపనకు జర్మనీ, తైవాన్, యూకె, జపాన్ వంటి దేశాలకు చెందిన పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఆయా పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాల్సి ఉంటుందని అన్నారు.
వేమగల్ ప్రాంతంలో ప్రారంభమవుతున్న మూడు పరిశ్రమల ద్వారా 2300 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. గ్లాక్సో స్మిత్క్లెయిమ్ కంపెనీ 1000 కోట్ల పెట్టుబడులతో 500 మందికి ఉద్యోగాలను కల్పిస్తోందన్నారు. టాటా కంపెనీ స్థాపనకు 50 ఎకరాల స్థలాన్ని అందించడం జరిగిందని తెలిపారు. కంపెనీ డిమాండ్ మేరకు 25 ఎకరాల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి ఆర్.వి.దేశ్పాండే, యూనెటెడ్ కింగ్డమ్ మంత్రి లార్డ్ ఫిల్టన్ మౌల్డ్, జిల్లా ఇన్చార్జి మంత్రి యు.టి.ఖాదర్, గ్లాక్సోస్మిత్ లైన్ కంపెనీ ఎండీ విదీష్, ఎమ్మెల్యేలు వర్తూరు ప్రకాష్, నారాయణస్వామి, ఎమ్మెల్సీ నజీర్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ, రాష్ట్ర పరిశ్రమల శాఖ కమషనర్ రత్నప్రభ, కోలారు కలెక్టర్ డాక్టర్ కేవీ త్రిలోక్చంద్ర తదితరులు పాల్గొన్నారు.