సాగునీటిపై సీఎం ప్రత్యేక దృష్టి!
ప్రాజెక్టులపై జిల్లాల వారీగా సమీక్షించనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి వనరుల అభివృధ్ధికోసం సమగ్ర కార్యాచరణకు పూనుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన నదులు, ఉపనదులు, చెరువుల కింద సాగుకు యోగ్యమైన భూమిని పూర్తిస్థాయిలో అభివృధ్ధిలోకి తెచ్చేలా ప్రణాళికలు తయారు చేసేందుకు నిశ్చయించారు. దీనికోసం జిల్లాల వారీగా ఉన్న భారీ, మధ్యతరహా, చిన్న నీటి వనరులపై పూర్తి స్థాయి సమీక్షలు జరిపి, అధికారులకు దిశానిర్ధేశం చేయాలని ఆయన భావిస్తున్నట్లగా తెలుస్తోంది.
ఈ కార్యక్రమాన్ని ఆయన 2,3 రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాతో ఆరంభించే అవకాశాలున్నాయ ని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాల వారీగా ఉండే సగటు వర్షపాతం, దాన్ని ఉపయోగించుకొని జరుగుతున్న సాగు, ప్రాజెక్టుల కింద సాగు, ప్రధాన ఎత్తిపోతల పథకాలు, పనులు కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో నెలకొన్న అవాంతరాలను సమగ్రంగా అధ్యయనం చేసి నీటి యాజమాన్య విధానాన్ని ఖరా రు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఆదిలాబాద్‌పై మంత్రి సమీక్ష..
ఆదిలాబాద్ జిల్లాతో సీఎం సమీక్షలు ప్రారంభించనున్న నేపథ్యంలో నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లాకు సంబంధిం చి సమగ్ర సాగునీటి ప్రణాళికలను తయారు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటే జిల్లాలో పెండింగ్లోప్రాజెక్టులను 2016 లోగా పూర్తి చేయాలని, ఏఐబీపీ, జైకా, ట్రిపుల్ఆర్, నాబా ర్డ్ కింద పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, పెన్‌గంగ నదిపై రూధా వ ద్ద మహారాష్ట్రతో కలసి నిర్మించే బ్యారేజీ ద్వారా 51,500 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం యోచి స్తోంది. దీని డీపీఆర్‌ను నెలాఖరుకు అందించాలని మంత్రి ఆదేశించారు.