తుమ్మిళ్ల ఎత్తిపోతలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని తుమ్మిళ్ల దగ్గర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ఇరిగేషన్ కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఆర్డీఎస్ పరిధిలోని ఆయకట్టుకు నీరందించడానికి తుమ్మిళ్ల ఎత్తిపోతలే శరణ్యమని కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు గురువారం జరిగిన భేటీలో కమిటీ దీనికి అంగీకారం తెలిపింది. ఈ పథకానికి రూ.120 కోట్లు ఖర్చవుతుందని ఇంజనీర్లు తెలిపారు.
ఆర్డీఎస్ కింద తెలంగాణకు మొత్తం 15.9 టీఎంసీలు రావాల్సి ఉండగా, కేవలం 5 టీఎంసీలే అందుతున్నాయి. దీంతో ఆ ప్రాంత ఆయకట్టుకు నీరందించలేక పోతున్నారు. దీంతో తుమ్మిళ్లను చేపట్టి ఆర్డీఎస్ కింద ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. ఇందిరాసాగర్ ప్రాజెక్టులో ఉన్న పంపులు, పైపులు తుమ్మిళ్ల పథకానికి ఉపయోగించాలని మంత్రులు ఈ సందర్భంగా సూచించారు.