Mulugu: లక్నవరం చెరువులో మునిగి యువతీ, యువకుడు మృతి
సాక్షి, ములుగు : జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. లక్నవరం చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కాగా, వారిద్దరూ హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) చెందినవారు.
వివరాల ప్రకారం.. ఐఎస్బీకి చెందిన ఆరుగురు(నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు) విద్యార్థుల బృందం లక్నవరం చెరువును చూసేందుకు వచ్చారు. అనంతరం సరదాగా సరస్సులోకి దిగారు. ఈత కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు యువతీ, యువకుడు నీటిలో మునిగిపోయారు. తోటి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. వారిద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మృతులను సాయి ప్రీతమ్ (24), తరుణి (20)గా గుర్తించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.