ఇప్పటికీ నాలోని ప్రేమ అలాగే ఉంది: రేణూ దేశాయ్
‘బద్రి’, ‘జానీ’ చిత్రాల్లో కథానాయికగా నటించిన రేణూదేశాయ్, ఇప్పుడు దర్శక నిర్మాతగా కొత్త అవతారమెత్తారు. మరాఠీలో ‘ఇష్క్ వాలా లవ్’ పేరుతో ఆమె ఓ సినిమా డెరైక్ట్ చేశారు. ఆ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదించి ఈ నెల 24న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ విచ్చేసిన ఆమెతో, ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది.
చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు. ఎలా ఉంది ఫీలింగ్?
హైదరాబాద్ నా ఇల్లు. ఇంటికొస్తే ఎవరికైనా ఆనందమే కదా. ఏడాది పాటు మరాఠీ సినిమాల బిజీలో పడి, ఇక్కడకు రాలేకపోయాను. ‘ఇష్క్‌వాలా లవ్’ కారణంగా మళ్లీ ఇక్కడకొచ్చే అవకాశం వచ్చింది.
మరాఠీలోనే ఎందుకు చేశారు. తెలుగులో సినిమా చేయొచ్చుగా?
నేను పుణేలోనే పుట్టి పెరిగాను. మాతృభూమిపై మమకారం ఉంటుంది కదా. దర్శకత్వం అనేది చేస్తే ముందు మరాఠీ సినిమానే చేయాలనేది నా నిర్ణయం. అందుకే... ‘ఇష్క్‌వాలా లవ్’ చేశాను. త్వరలో హిందీ సినిమా చేయబోతున్నాను.
తెలుగులో డబ్ చేయడానికి కారణం?
ఈ కాన్సెప్ట్ తెలుగువారికి కూడా బాగా నచ్చుతుందనిపించింది. చాలా సింపుల్ మూవీ. అందుకే డబ్ చేశా.
మరి తెలుగులో డెరైక్ట్‌గా సినిమా ఎప్పుడు చేస్తారు?
మంచి ప్రొడక్షన్ దొరికితే... చేయడానికి సిద్ధమే.
ఈ సినిమా మీరే స్వీయ దర్శకత్వంలో నిర్మించారు కదా. ఇక్కడ కూడా అలాగే చేయొచ్చుకదా?
స్వీయ దర్శకత్వంలో నిర్మించడం అనేది ‘ఇష్క్‌వాలా లవ్’తోనే లాస్ట్. ఇంకెప్పుడూ ఇలా చేయను. ఎందుకంటే దర్శకురాలిగా, నిర్మాతగా ఈ సినిమా కోసం నేను పడ్డ సంఘర్షణ అంతాఇంతా కాదు. అంత టెన్షన్ ఇక అనుభవించలేను. వేరే వాళ్ల దర్శకత్వంలో నేను సినిమా నిర్మించడానికి రెడీ. అలాగే... వేరే వాళ్లు సినిమా నిర్మిస్తే, నేను దర్శకత్వం వహిస్తా. ఇక నుంచి ఏదైనా ఒక్క బాధ్యతే.
ఈ సినిమా ట్రైలర్లో ‘పెళ్లి జరిగితే ప్రేమ తరిగిపోతుంది’ అనే డైలాగ్ ఉంది. అది స్వానుభవంతో రాసుకున్న డైలాగా?
నా ప్రేమ తరిగిపోలేదే. నేనెందుకు అలా రాస్తాను. ఇప్పటికీ నాలోని ప్రేమ అలాగే ఉంది. నా జీవితం ఏంటో ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. నా ‘ఇష్క్‌వాలా లవ్’కి నా జీవితానికీ అస్సలు సంబంధం లేదు. అయినా ఇది నేను ఆరేళ్ల క్రితం రాసుకున్న కథ. అప్పుడు మా అమ్మాయి ఆద్యకు రెండున్నరేళ్లు.
‘ఇష్క్‌వాలా లవ్’కి ప్రేరణ ఏంటి?
నేటి యువతరమే ప్రేరణ. ప్రేమ, పెళ్లి ఈ రెండు అంశాలపై యువతలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. నేటి యువత వీటి విషయంలో చాలా భిన్నంగా ఆలోచిస్తోంది. దీనిపై రీసెర్చ్ చేసి, ఎందరో యువతీయువకులను ఇంటర్వ్యూ చేసి ఈ కథ తయారు చేసుకున్నాను. సాధారణంగా ప్రేమలో ఉన్న అబ్బాయిలు... పెళ్లికి నో చెబుతూ ఉంటారు. కానీ మా సినిమాలో అమ్మాయి పెళ్లికి ‘నో’ చెబుతుంది. అదే ట్విస్ట్. దాన్ని తెరపై చూస్తేనే బావుంటుంది. ఈ నెల 24న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం.
ఈ సినిమా విషయంలో పవన్‌కల్యాణ్ సహకారం ఏమైనా తీసుకున్నారా?
మరాఠీలో నేను తొలుత ‘మంగళాష్టక్’ సినిమా నిర్మించాను. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘ఇష్క్‌వాలా లవ్’ని స్వీయ దర్శకత్వంలో నిర్మించాను. ఈ సినిమాక్కూడా మంచి స్పందన లభిస్తోంది. తొలి సినిమాను 26 రోజుల్లో నిర్మించినప్పుడు పవన్‌కూడా ఆశ్చర్యపోయారు. ఇక సినిమాను కూడా అనుకున్న బడ్జెట్లో అనుకున్నట్టు తెరకెక్కించా. స్వతహాగా నాకేమైనా సమస్య వస్తే... ఆయన సహకారం తీసుకోవాలి. అసలు నాకు ఆ అవసరమే రాలేదు. ఇక సహకారం దేనికి?
అకీరానందన్ని ఈ సినిమా ద్వారా నటునిగా పరిచయం చేయాలనే ఆలోచన మీదేనా?
నాదే. ఇందులో ఓ పదేళ్ల బాబు కేరక్టర్ ఉంది. చాలామంది అబ్బాయిల్ని చూశాను. కానీ, ఎందుకో అకీరాను చూడగానే... వాడితో చేయిస్తే ఎలా ఉంటుంది? అనిపించింది. పైగా నా దర్శకత్వంలో రూపొందే సినిమా, నా కొడుకు పరిచయ చిత్రం కావడం తల్లిగా నాకు ఆనందమేగా. అందుకే వాణ్ణి అడిగా. చేస్తా అన్నాడు. వెంటనే వాళ్ల నాన్నకు ఫోన్ చేసి చెప్పాను. ‘ఏంటి... వాడితో చేయిస్తున్నావా! అంటూ ఆయన పెద్ద పెద్దగా నవ్వేశారు.
ఇంతకూ పవన్‌కల్యాణ్ ఈ సినిమా చూశారా?
లేదండీ... ప్రస్తుతం తెలుగు వెర్షన్ డబ్బింగ్ దశలో ఉందీ సినిమా. అయ్యాక చూపిస్తా. ట్రైలర్స్ అయితే చూశారు. ఆయనకు బాగా నచ్చాయి.
అకీరా ఎలా చేశాడు?
చాలా బాగా చేశాడండీ. అందరూ బాగా చేశాడని అంటుంటే అమ్మగా చాలా ఆనందం అనిపిస్తోంది. హీరోయిన్ కాంబినేషన్లో సీన్ అది. చెప్పింది చెప్పినట్లు చేసేశాడు. డబ్బింగ్ అప్పుడు మాత్రం నాకు కాస్త టెన్షన్ అనిపించింది. ఎలా చెబుతాడో ఏమో అని. కానీ... సీన్ పేపర్ తీసుకొని, సీరియస్‌గా స్క్రీన్‌ని చూస్తూ టకటకా డబ్బింగ్ చెప్పేశాడు. అప్పుడనిపించింది. వాడి రక్తంలోనే ఉంది కదా నటన అని.
పవన్‌కల్యాణ్ తనయుని తొలి సినిమా అంటే... అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఉంటాయి కదా. మరీ దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకున్నారా?
ఆ దిశగా అస్సలు ఆలోచించలేదండీ. ఎందుకంటే... ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయం. పవర్‌స్టార్ తనయుడిగా కాకుండా, ఒక ఆర్టిస్ట్‌గా మాత్రమే వాణ్ణి చూపించా.
ఎలాగూ దర్శకురాలయ్యారు. మరి పవర్‌స్టార్‌ని ఎప్పుడు డెరైక్ట్ చేస్తారు?
ఆయనో పెద్ద సూపర్‌స్టార్. నేనేమో చిన్న దర్శకురాలిని. ఆయన్ను డెరైక్ట్ చేయాలంటే నా స్థాయి చాలదు. ముందు సక్సెస్‌లు రానీయండి. తర్వాత చూద్దాం.
సమాజానికి మీరు చిన్న దర్శకురాలే కావచ్చు. కానీ... పవన్‌కల్యాణ్‌గారికి మీరు స్పెషల్ కదా?
చూడండీ... కుటుంబ జీవితాన్ని, వృత్తి జీవితాన్ని ఆయన కలిపి చూడరు. నేను కూడా ఆయన నుంచి నేర్చుకుంది అదే. మీరన్నట్లు ఆయన్ను డెరైక్ట్ చేసే స్థాయికి వస్తే అంతకంటే కావాల్సిందేముంది.
నటనకు పుల్‌స్టాప్ పెట్టేసినట్లేనా?
నా జీవితంలో ఏదీ ప్లాన్ చేసుకొని చేసింది కాదు. అనుకోకుండానే నటిని అయ్యాను. అలాగే... మోడలింగ్ చేశాను. ఎడిటింగ్ చేశాను. మీకు తెలుసో తెలీదో... ‘ఖుషి’ సినిమాలో ‘హే మేరా జహా...’ పాట ఎడిట్ చేసింది నేనే. ఫ్యాషన్ డిజైనర్‌గా కూడా పనిచేశాను. నిర్మాతనయ్యాను. దర్శకురాలినయ్యాను. ముందు ముందు ఏం జరుగుతుందో.
పవన్‌కల్యాణ్‌తో నటిస్తారా?
ఆ సందర్భం రావాలిగా.
ప్రేమ గురించి మీ అభిప్రాయం?
దాన్ని ఓ ఛట్రంలో బంధించలేం. అది విశ్వవ్యాపితం. ప్రేమను ఎప్పుడూ గౌరవిస్తాన్నేను.
మీకు ప్రేరణగా నిలిచిన వ్యక్తి ఎవరు?
నా జీవితానికి ప్రేరణగా మిగిలిన వ్యక్తి ఒకరే. ఆయన ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
- బుర్రా నరసింహా