సామాజిక పరిణీత
సేవ
ఇటీవల ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘ఇష్క్‌జాదే’ చిత్రానికిగాను ‘ప్రత్యేక ప్రశంస’ అందుకుంది నటి పరిణీతి చోప్రా. సెలబ్రిటీ మేనేజర్ నుంచి సెలబ్రిటీగా మారింది. ఒకప్పుడు రాణీ ముఖర్జీ దగ్గర మేనేజర్‌గా పనిచేసేది. రాణితో పాటు సెట్స్‌కు వెళ్లేది. ‘‘మీ కజిన్ ప్రియాంకా చోప్రాలా నువ్వు కూడా సినిమాల్లో నటించ వచ్చు కదా?’’ అని అడిగింది రాణీముఖర్జీ ఒకరోజు. తనకు ఇష్టం లేదని చెప్పింది పరిణీతి. ఇష్టం లేదంటే మాత్రం? కల్యాణం వచ్చినా, కక్కొచ్చినా... సినిమాల్లో ఛాన్సు వచ్చినా... ఆగదు కదా! స్క్రీన్‌టెస్ట్ అవసరం లేకుండానే యశ్‌రాజ్ ఫిల్మ్‌లో అవకాశం సంపాదించిది. ‘బిగ్ బి’లాంటి వారి చేత బిగ్ ప్రశంసలు అందుకుంది.
‘‘గ్లామర్ డాల్‌లా లేదు. పక్కింటి అమ్మాయిలా సహజ సౌందర్యంతో ఉంది’’ అని విమర్శకుల ప్రశంసలు అందుకొంది. నటన సంగతి పక్కనబెడితే...సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అంటే పరిణీతికి ఇష్టం. షబానా ఆజ్మీ ‘మిజ్వాన్ వెల్ఫేర్ సొసైటీ’కి మద్దతుగా ‘విల్స్ లైఫ్‌స్టయిల్ ఇండియా ఫ్యాషన్ వీక్’లో ర్యాంప్ వాక్ చేసింది. ‘‘నా ప్రాధాన్యత ర్యాంప్ వాక్ కాదు. మిజ్వాన్కు నా వంతుగా సహాయపడడానికి చేశాను’’ అంటున్న పరిణీతి టీవిలో పర్యావరణ సంబంధమైన కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది. పర్యావరణ
స్పృహను పెంచడానికి, విద్యుత్ సౌకర్యానికి నోచుకొని గ్రామాల్లో వెలుగులు నింపడానికి రకరకాల స్వచ్ఛందసంస్థలతో కలిసిపనిచేస్తోంది.
‘‘హీరోతో పార్కుల వెంట తిరుగుతూ పాటలు పాడే హీరోయిన్ పాత్రలు నాకు ఇష్టం లేదు’’ అని కెరీర్ మొదట్లో ప్రకటించిన పరిణీతి, కెరీర్ ఊపందుకున్నాక కూడా... వీలు చేసుకొని రకరకాల సామాజికసేవా కార్యక్రమాలలో పాల్గొంటోంది. మెచ్చదగ్గ అమ్మాయే!