చెన్నైయిన్ కెప్టెన్ ఎలనో అరెస్ట్, విడుదల
పణజి: ఐఎస్ఎల్ రెండో సీజన్లో విజేతగా నిలిచిన అనంతరం చెన్నైయిన్ ఎఫ్సీ ఆటగాళ్ల విజయోత్సవాలు స్ట్రయికర్ ఎలనో బ్లమ్మర్కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో ఎఫ్సీ గోవాను 3-2తో ఓడించిన అనంతరం ఆటగాళ్లు సంబరాల్లో మునిగారు. అయితే కాస్త అతిగా స్పందించిన ఎలనో... ఎఫ్సీ గోవా సహ యజమాని దత్తరాజ్ సాల్గావ్కర్ను తన మోచేతితో గుద్దాడు.
దీన్ని సీరియస్గా తీసుకున్న సాల్గావ్కర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎలనోను అదే రోజు రాత్రి అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే జట్టు ఆటగాళ్లతో పాటు రిలయన్స్ స్పోర్ట్స్ అధికారులు అతడికి బెయిల్ ఇప్పించారు. వెంటనే సోమవారం ఉదయం 5 గంటలకు తను బ్రెజిల్ వెళ్లిపోయినట్టు న్యాయవాది రాజీవ్ గోమ్స్ తెలిపారు. ఎలనో వ్యవహారంపై ఐఎస్ఎల్ సీరియస్ అయ్యింది. ఇలాంటి ఘటనలు లీగ్ ఇమేజిని దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది. ఇలాంటివి సహించేది లేదని, అందుకే విషయాన్ని క్రమశిక్షణ కమిటీకి రిఫర్ చేసినట్టు తెలిపింది.