Islamic State members
-
ఎర్రకోట వద్ద ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూకశ్మీర్(ఐఎస్జేకే) ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్చేశారు. ఎర్రకోట సమీపంలోని జామా మసీదు బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న పర్వేజ్(24), జంషీద్(19)లను అరెస్ట్ చేసినట్లు స్పెషల్ సెల్ డీసీపీ కుష్వాహా తెలిపారు. కశ్మీర్లోని షోపియాన్ జిల్లాకు చెందిన వీరిద్దరి నుంచి రెండు .32 పిస్టల్స్, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు తమ రాకపోకలకు ఢిల్లీని కేంద్రంగా మాత్రమే వాడుతున్నారనీ, ఇక్కడ దాడులకు ఎలాంటి ప్రణాళికలు రచించలేదని కుష్వాహా తెలిపారు. పర్వేజ్ యూపీలోని గజ్రోలా పట్టణంలో ఉన్న ఓ కళాశాలలో ఎంటెక్ చదువుతుండగా, జంషిద్ డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్నాడు. పర్వేజ్ సోదరుడిని భద్రతాబలగాలు ఈ ఏడాది జనవరిలో షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమార్చాయన్నారు. 2016, జూలైలో తన తమ్ముడు, హిజ్బుల్ ఉగ్రవాది ఫిర్దౌస్ను భద్రతాబలగాలు కాల్చిచంపడంతో పర్వేజ్ ఉగ్రబాట పట్టాడని పోలీసులు వెల్లడించారు. జంషిద్ ఆయుధాలను యూపీ నుంచి ఢిల్లీకి తరలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. -
మహిళలపై ఐఎస్ఐఎస్ హత్యాచారాలు
బాగ్దాద్ : ఇరాక్లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల నరమేధం కొనసాగుతోంది. కానీ ఆ నరమేధం ఈ సారి సభ్యసమాజం తలదించుకునేలా సాగింది. తమ లైంగికవాంఛ తీర్చలేదని... మహిళలపై తుపాకులు ఎక్కుపెట్టి విచక్షణరహితంగా కాల్చారు. ఆ కాల్పుల్లో ఒకరా ఇద్దరా.. ఏకంగా 150 మంది మరణించారు. మృతుల్లో చిన్నారులు, యువతులు, గర్బవతులు కూడా ఉన్నారు. అందుకు అడ్డు వచ్చిన 91 మంది పురుషులను అతి కిరాతికంగా చంపిశారు. అనంతరం వారందరినీ సామూహికంగా ఖననం చేసినట్లు సమాచారం. ఈ ఘటన ఫాజుల్లా పట్టణంలో చాలా రోజుల క్రితం చోటు చేసుకుందని, ఈ దారుణానికి అల్ అన్బర్ ప్రావిన్స్లోని జీహాదీ నేత అబూ అనాస్ అలి లిబి నేతృత్వంలో వహించారని పాక్ మీడియా కథనాలను ప్రచురించింది. ముస్లిమేతర తెగలలో ముఖ్యంగా యాజిదీ తెగకు చెందిన వారిని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మొదటి నుంచి టార్గెట్ చేస్తున్నారు. జీహాదీలను పెళ్లి చేసుకోవాలని, బానిసల్లా పడి ఉండాలని ఆ వర్గానికి చెందిన మహిళలపై అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. యాజిదీ తెగలో మగవారిని చంపుతూ మహిళలను బానిసలుగా చేస్తున్నారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఆగడాలు తట్టుకోలేక ఫాజుల్లా ప్రాంత ప్రజలు ఇళ్లు విడిచి ఎడారి ప్రాంతాలకు తరలిపోతున్నారని మీడియా ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా వెళ్లిన వారిలో చిన్నారులు చలి తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారని మానవ హక్కుల సంస్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.