హైలెస్సా..లెస్సా..హైలెస్సా..
సాక్షి, ముంబై: సబర్బన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించే నిమిత్తం నగర తూర్పు తీరప్రాంతాల్లో త్వరలోనే జల రవాణా సేవలను అందుబాటులోకి తేనున్నారు. అయితే ఐలాండ్ ప్యాసింజర్ వాటర్ ట్రాన్స్పోర్ట్ (ఐపీడబ్ల్యూటీ) ప్రాజెక్టుకు మంచి స్పందన వస్తుందో లేదో అని రాష్ట్రప్రభుత్వం సందేహం వ్యక్తం చేస్తోంది. ఈ జల రవాణాను నెరుల్ నుంచి మండ్వా వరకు కొనసాగించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. స్టేట్ చీఫ్ సెక్రటరీ (సీఎస్), ఇతర ముఖ్యమైన విభాగాలకు చెందిన అధికారులు ఇటీవలే ఈ విషయమై ఓ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. కాగా, ఈ ప్రాజెక్టు నిమిత్తం తయారు చేయాలనుకున్న జెట్టీల పరిమాణంపై సమావేశంలో చర్చించారు. మొదట చిన్న సైజు జెట్టీలను నడపాలని, జలరవాణాకు మంచి స్పందన లభించిన తర్వాత జెట్టీల పరిమాణం మరింత పెంచవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ సేవలతో హార్బర్ మార్గంలో కొంత మేర రద్దీ తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎంఎంఆర్డీఏ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సమావేశంలో తూర్పు తీరప్రాంతంలో ఏర్పాటు చేయనున్న జల రవాణా విజయవంతం అవుతుందో లేదో అన్న సందేహాన్ని అధికారులు వెలిబుచ్చారన్నారు. దీంతో జెట్టీల పరిమాణం తగ్గించాలని ఎంఎస్‌ఆర్డీసీని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ జెట్టీల పరిమాణం ప్రతిపాదనలో 40 మీటర్లు ఉండగా 10 మీటర్లు తగ్గించమని అధికారులు సూచించారన్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇదిలా వుండగా 40 మీటర్ల జెట్టీలు నిర్మించడానికి సుమారు రూ.1,300 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారుల అంచనా. అంత ఖర్చు పెట్టిన తర్వాత జలరవాణాకు తగిన స్పందన రాకపోతే కష్టమని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రయోగాత్మకంగా 30 మీటర్ల జెట్టీలను నడపాలని యోచిస్తోంది. దీని వల్ల ఖర్చు కూడా సుమారు రూ.350 - 400 కోట్లు తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, నెరుల్ జెట్టీ నిర్మాణాన్ని రూ.308.28 కోట్లతో ఫెరీ వార్ఫ్‌కు కాంట్రాక్టుకు ఇవ్వగా, జె.కుమార్ ఫౌండేషన్ అసోసియేట్స్, డీబీఎం సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్లు... మండ్వా జెట్టీల నిర్మాణాన్ని రూ.63.71 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ఈ జెట్టీల నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఎంఎస్ఆర్డీసీ ప్రైవేట్ వ్యక్తులకు ఈ సేవలను అప్పగించనుంది. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ జెట్టీల నిర్మాణం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే వీటి నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
జల రవాణాతో లాభాలు...
ఈ జల రవాణా పర్యావరణానికి ఎలాంటి చేటు కలిగించదు. అంతేకాకుండా ఈ సేవల ద్వారా ప్రయాణికుల సమయం కూడా ఆదా అవుతుంది. జల రవాణా సేవలు వేగంగా ఉండడమే కాకుండా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉంటాయి. నగర వాసుల వాహన నిర్వహణ ఖర్చు కూడా కొంత మేర ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా రోడ్లపై కూడా కొంత మేర రద్దీ తగ్గుతుంది. అంతేకాకుండా వాతావరణ, శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది.