టర్కీలో ఆత్మాహుతి దాడి
టర్కీలో కుర్దిష్ రెబల్స్ శుక్రవారం ఆత్మాహుతి దాడి చేశారు, ఈ దాడిలో 11 మంది పోలీసులు మరణించగా, 78 మంది ప్రజలు గాయపడ్డారు. తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో దాదాపు పోలీస్ హెడ్‌క్వార్టర్స్ మొత్తం ధ్వంసమయింది. దాడి జరిగిన ప్రాంతం సిరియా సరిహద్దుకి అత్యంత సమీపంలో ఉంది. పేలుడు పదార్థాలతో కూడిన ఓ ట్రక్కు ఉదయం 6:45 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) భవనంలోకి వచ్చి పేలిపోయింది.
ఆరోగ్య శాఖ మంత్రి రెకెప్ అక్డాగ్ మాట్లాడుతూ గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఐసిస్, కుర్దిష్ రెబల్స్‌కు వ్యతిరేకంగా టర్కీ సిరియాలో చేపట్టిన మూడు రోజుల ఆపరేషన్ ముగిసిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ పక్కన ఉన్న భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. భవనానికి 50 మీటర్ల దూరంలో బాంబు పేలిందని టర్కీ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఉగ్రవాద సంస్థ టర్కీ భద్రతా బలగాలపై ప్రతీరోజూ ఏదో ఒక దాడి చేస్తూనే ఉంటుంది. టర్కీ శుక్రవారం కూడా మరో నాలుగు ట్యాంకర్లను సిరియా భూభాగంలోకి పంపింది. కుర్దిష్ రెబల్స్ టర్కీ ప్రభుత్వం ఐసిస్ తీవ్రవాదాన్ని అరికట్టడం కంటే తమని దేశంలోకి రానివ్వకుండా చేయటానికే చర్యలు ఎక్కువగా తీసుకుంటుందని ఆరోపిస్తున్నారు. అయితే టర్కీ ప్రధాని బినాలీ యిదిరిం పాశ్చాత్య మీడియా సిరియా ఆపరేషన్ విషయంలో ఎలాంటి నిజాలూ తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు రాస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.