కోవిడ్ కలకలంతో సీన్ రివర్స్... మళ్లీ బ్యాక్ టు హోమ్!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో ఐటీ ఉద్యోగులు మళ్లీ పూర్తిస్థాయిలో ఇంటి నుంచి పనిచేసేందుకు సన్నద్ధమౌతున్నారు. ఒమిక్రాన్, కోవిడ్ కలకలం కారణంగా మహానగరం పరిధిలోని పలు ఐటీ కంపెనీలు రూటు మార్చాయి. అవసరాన్ని బట్టి కొందరు ఉద్యోగులు ఆఫీసుకు రావడం..మరికొందరు ఇంటి నుంచి పనిచేసే హైబ్రీడ్ విధానానికి కూడా తాత్కా లికంగా బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) వర్గాలు తెలిపాయి. భవిష్యత్లో ఒమి క్రాన్ ముప్పు మరింత పెరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం పైనా నగరంలోని సుమారు 1500 ఐటీ కంపెనీలు దృష్టి సారించాయని పేర్కొన్నాయి. తాజా పరిస్థితులను ఎదుర్కోవడంలో కంపెనీలు, సిబ్బందికి ఏడాదిన్నర అనుభవం ఉందని తెలిపాయి. ఐటీ ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగించేందుకు, ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు అనువైన సాంకేతిక ఏర్పాట్లు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇంటి నుంచి కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పలువురు ఐటీ కంపెనీల బాస్లు సెలవిస్తుండడం విశేషం.
ఐటీ...తగ్గేదేలే..
గత రెండేళ్లుగా ఐటీ రంగానికి కోవిడ్ కలకలం వెంటాడుతోంది. గత ఏడాది ఆగస్టు నాటికి కేసుల తీవ్రత తగ్గడంతో అన్ని రకాల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. దీంతో ఐటీ కార్యాలయాలకు కొందరు సిబ్బందిని పిలిచి పనిచేయించే(హైబ్రీడ్) విధానం ప్రారంభమైంది. గతేడాది అక్టోబరు నాటికి మొత్తం ఐటీ ఉద్యోగుల్లో సుమారు 15– 20 శాతం మంది కార్యాలయాలకు వచ్చి పనిచేయటం కనిపించింది. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుందని, త్వరలో అత్యధిక ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారని భావించారు.
విదేశాల నుంచి క్లయింట్లు ఇక్కడి ఐటీ కంపెనీలను సందర్శించడం, స్ధానిక ఐటీ కంపెనీల ప్రతినిధులు వివిధ దేశాల్లోని తమ క్లయింట్లను కలిసి ‘ప్రెజెంటేషను’ ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కానీ నవంబరు నెలాఖరు నుంచి ఒమిక్రాన్ కలకలం సృష్టించడంతో వర్క్ఫ్రంహోంకే ప్రాధాన్యత నివ్వాలని మెజార్టీ ఐటీ కంపెనీల యాజమాన్యాలు భావిస్తుండడం విశేషం. ఆఫీసుకు రావొద్దని ఆయా సంస్థల యాజమాన్యాల నుంచి సూచనలు రావడంతో, కార్యాలయాలకు వచ్చే ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోందని స్థానిక ఐటీ కంపెనీ ఉన్నతోద్యోగి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.