ఐటీకి పెద్ద పీట
రాష్ట్రాన్ని అగ్రగామిగా చేయడమే లక్ష్యం
దేవనహళ్లి వద్ద 10,500 ఎకరాల్లో ఐటీఐఆర్
ఐటీ, బీటీ పరిశ్రమల అభివృద్ధికి కృషి
దేశ ఐటీ ఎగుమతుల్లో కర్ణాటక నుంచే 30 శాతం
సిలికాన్వ్యాలీని మించేలా బెంగళూరును తీర్చిదిద్దుతాం
‘బెంగళూరు ఐటీ ఈ.బిజ్’ ప్రారంభోత్సవంలో సీఎం సిద్ధు
బెంగళూరు : రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిపే చర్యల్లో భాగంగా దేవనహళ్లి వద్ద 10,500 ఎకరాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. మొదటి దశలో 2,722 ఎకరాల భూ స్వాధీన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామన్నారు. నగర శివారులోని బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రంలో మూడు రోజుల పాటు జరగనున్న ‘బెంగళూరు ఐటీ ఈ. బిజ్’ను సీఎం సిద్ధరామయ్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ....రాష్ట్రంలో ‘డాటా అనాలిసిస్ క్లౌండ్ కంప్యూటింగ్ మొబిలిటీ’ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. ఐటీ, బీటీ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. మొత్తం దేశ ఐటీ ఎగుమతుల్లో ఒక్క కర్ణాటక నుంచే 30 శాతం వరకూ జరుగుతోందన్నారు.
ఐటీ రంగంలో అమెరికాలోని సిలికాన్వ్యాలీను మించేలా బెంగళూరును తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్ఆర్ పాటిల్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే కంపెనీలకు ఉచితంగా భూమి, ఉద్యోగులకు రెండేళ్లపాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి ఎన్నో సౌకర్యాలు కల్పించబడుతుందని తెలిపారు. రాష్ట్రలో 2020కు ఐటీ సంబంధ వ్యాపార లావాదేవీలు నాలుగు లక్షల కోట్లకు చేరుతుందన్నారు. అదే సమయానికి రాష్ట్ర ఐటీ రంగంలో 20 లక్షల మందికి నేరుగా, 60 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయాని ఆశాభావం వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పోలీస్తే ఐటీ పెట్టుబడులకు కర్ణాటక అనువైన రాష్ట్రమని ఐటీ, బీటీ విభాగం కార్యదర్శి శ్రీవత్సకృష్ణ తెలిపారు.