ఇటలీ భూకంపంతో ఎందుకంత నష్టం?
ఇటలీలో సంభవించినది ఒకరకంగా చెప్పాలంటే చిన్నపాటి భూకంపమే. ఇంతకుముందు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సంభవించినవి ఇంతకంటే చాలా రెట్లు ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు. అయినా ఇటలీలో నష్టం ఎక్కువగా కనిపించింది. చాలా భవనాలు నేలమట్టం అయిపోయాయి. పెద్దపెద్ద భవనాలు ఉండాల్సిన చోట రాళ్ల కుప్పలే దర్శనం ఇస్తున్నాయి. 247 మంది చనిపోయారు, వందలాది మంది గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుపోయారు. అమాట్రిస్ నగరంలో సగం ఇక దాదాపుగా లేదని మేయర్ ప్రకటించారు. కొన్ని శతాబ్దాల క్రితం రాళ్లతో కట్టిన చర్చిలు, ఇతర భవనాలు ఇప్పుడు పూర్తిగా కూలిపోయాయి. ఆ సమయానికి.. భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేయడం వాళ్లక తెలియదు. సుమారు వందేళ్ల క్రితం కూడా అసలు ఇలాంటి ఉత్పాతాలను తట్టుకునే భవన నిర్మాణం ఎలా చేయాలో ఎవరికీ తెలియదని ఇంగ్లండ్‌లోని మిల్టన్ కీన్స్ ఓపెన్ యూనివర్సిటీలో ప్లానెటరీ జియోసైన్సెస్ ప్రొఫెసర్ డేవిడ్ ఎ రోథరీ తెలిపారు. 2015 ఏప్రిల్‌లో నేపాల్‌లో సంభవించిన భూకంపం తీవ్ర 7.8. అది దీనికంటే 250 రెట్లు ఎక్కువ ప్రకంపనలు సృష్టించింది. దాంతో 8వేల మంది మరణించారు.
కానీ ఇప్పుడు వచ్చినది భూమి ఉపరితలం నుంచి కేవలం 6 మైళ్ల లోపలే వచ్చింది. వీటిని షాలో భూకంపాలు అంటారు. వీటివల్ల భూమి ఉపరితలం మీద ప్రకంపనలు ఎక్కువ తీవ్రతతో వస్తాయని రోథర్ వివరించారు. భూమి లోపల ఉండే టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగానే ఇప్పటి భూకంపం వచ్చింది. ఇంతకుముందు 2009లో లాక్విలా పట్టణంలో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 295 మంది మరణించగా వెయ్యి మంది గాయపడ్డారు. దాదాపు 55 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ రెండు భూకంపాల మధ్య చాలా పోలికలున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొత్తగా కట్టే భవనాలు భూకంపాలను తట్టుకునేలా ఉండాలన్న నిబంధనలున్నాయని, కానీ ఇప్పటికే ఉన్న భవనాలను ఎలా బాగుచేయాలో మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.