నగదుతో పాటు సిగరెట్లనూ ఎత్తుకెళ్లారు..
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్) : బాదేపల్లి పట్టణంలోని ఆర్కే గార్డెన్ సమీపంలో గల ఐటీసీ(ఇండియన్ టొబాకో కంపెనీ) గోదాంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ చోటుచేసుకుంది. బాధితులు సంతోష్, శ్యాంసుందర్ కథనం మేరకు.. శుక్రవారం రాత్రి తమ కలెక్షన్‌ను ఇంటికి తీసుకెళ్లకుండా బీరువ, తదితర లాకర్లలో భద్రపరిచి గోదాంకు తాళం వేసి వెళ్లామన్నారు. ఉదయం 10గంటల తరువాత దుకాణం తెరచి చూడగా ఆఫీస్‌లోని బీరువా తెరిచి ఉండడం, కంప్యూటర్లు, తదితర వస్తువులు చిందరవందరగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భద్రపర్చిన డబ్బుల దాదాపు రూ.6.85 లక్షలు అపహరించారని, అదేవిధంగా రూ.2.40 లక్షల విలువ గల సిగరెట్లు ఎత్తుకెళ్లారని తెలిపారు.
దొంగలు పైకప్పు రేకును మనిషి పట్టే అంత సైజుమేరకు కట్టర్ ద్వారా కత్తిరించి లోపలికి ప్రవేశించారు.అనంతరం సీసీ కెమెరాలకు సంబంధించిన హార్ట్ డిస్క్‌ను తొలగించి నగదు, సిగరెట్లను తమ వెంట తీసుకెళ్లారు. రెండు కంప్యూటర్ మానిటర్లను ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదుతో జడ్చర్ల సీఐ బాల్‌రాజ్‌యాదవ్, క్లూస్ టీం, తదితర సిబ్బంది గోదాంకు చేరుకుని విచారించారు. చోరీకి సంబంధించిన వేలిముద్రలు, తదితర ఆధారాలను సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాల్‌రాజ్‌యాదవ్ తెలిపారు .
అనుమానాలెన్నో..
కాగా చోరీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజు గోదాం మూసివేసే సమయంలో ఆ రోజు కలెక్షన్‌ను తమ వెంటే తీసుకెళ్లే నిర్వాహకులు శుక్రవారం తీసుకెళ్లలేదు. అంటే గోదాములో కలెక్షన్ ఉందని తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారా అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నా యి. అంతేగాక సీసీ కెమెరాలకు సం బం ధించి హార్ట్‌డిస్క్‌ను తీసుకెళ్లడం, గోదాంలోకి ప్రవేశించడం వంటివి గమనిస్తే పక్కా స్కెచ్‌తోనే చోరీకి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.