ఐటీఐ పునర్వ్యవస్థీకరణ!
ఉపాధి కల్పనకు కేంద్ర ప్రభుత్వం యోచన
న్యూఢిల్లీ: ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని చెపుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఐటీఐ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తోంది. కేంద్ర కార్మిక మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సోమవారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీఐ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు. 1961 నాటి అప్రెంటీస్ చట్టానికి సవరణలు ప్రతిపాదించనున్నట్టు పేర్కొన్నారు.
అప్రెంటీస్ చట్టానికి సవరణల బిల్లు ఈ సెషన్లోనే పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఐటీఐని పునర్వ్యవస్థీకరించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభిస్తుందని తోమర్ వివరించారు. దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత.. టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ప్రోత్సహించేందుకు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీలను కెరీర్ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, తనిఖీల వివరాలు, వార్షిక ఆదాయ వివరాలు సమర్పణ, ఫిర్యాదులకు సంబంధించి ఏకీకృత వెబ్ పోర్టల్‌ను అభివృద్ధి పరిచినట్టు వెల్లడించారు.