ఇవనోవిచ్ ఇంటికి...
► మూడో రౌండ్లోనే ఓడిన మాజీ చాంపియన్
► ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా, వీనస్
పారిస్: కొంతకాలంగా ఫామ్‌లో లేని ప్రపంచ మాజీ నంబర్‌వన్ అనా ఇవనోవిచ్‌కు ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ నిరాశే మిగిలింది. గతేడాది ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో సెమీఫైనల్‌కు చేరిన ఈ సెర్బియా బ్యూటీ ఈసారి మాత్రం మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. 2008 చాంపియన్, 14వ సీడ్ ఇవనోవిచ్ శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 4-6, 4-6తో 24వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. నాలుగు ఏస్‌లు సంధించిన ఇవనోవిచ్, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 29 అనవసర తప్పిదాలు చేసిన ఈ సెర్బియా స్టార్ తన సర్వీస్‌ను ఏడుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.
మరోవైపు టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన మూడో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా 6-4, 7-6 (12/10)తో 26వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)పై గెలిచింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-4, 6-2తో పార్మెంటియర్ (ఫ్రాన్స్)పై, తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 7-6 (7/5), 1-6, 6-0తో కార్నెట్ (ఫ్రాన్స్)పై, 12వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) 6-4, 3-6, 6-1తో 22వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా)పై, పుతింత్సెవా (కజకిస్తాన్) 6-1, 6-1తో కరీన్ (ఇటలీ)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో 11వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్), 13వ సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఫెరర్ 6-4, 7-6 (8/6), 6-1తో 21వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)పై, థీమ్ 6-7 (4/7), 6-3, 6-3, 6-3తో జ్వెరెవ్ (జర్మనీ)పై నెగ్గారు. మరోవైపు ఆరో సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) గాయంతో మూడో రౌండ్ మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు. గుల్బిస్ (లాత్వియా)తో జరి గిన మూడో రౌండ్లో సోంగా తొలి సెట్లో 5-2తో ఆధిక్యంలో ఉన్నపుడు గాయం కారణంగా నిష్ర్కమించాడు.
క్వార్టర్ ఫైనల్లో పేస్-హింగిస్ జంట
మిక్స్డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ (భారత్) -హింగిస్ (స్విట్జర్లాండ్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్లో పేస్-హింగిస్ ద్వయం 2-6, 7-5, 10-6తో ‘సూపర్ టైబ్రేక్’ లో నాలుగో సీడ్ ష్వెదోవా (కజకిస్తాన్)- మెర్జియా (రుమేనియా) జోడీపై గెలిచింది.