వరల్డ్ కప్ కు ఇంగ్లండ్ అర్హత!
దుబాయ్:వచ్చే ఏడాది స్వదేశంలో జరుగునున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు అర్హత సాధించింది. ఐసీసీ మహిళల చాంపియన్స్షిప్ సిరీస్‌లో భాగంగా శనివారం కొలంబోలో శ్రీలంకతో జరిగిన వన్డేలో ఇంగ్లండ్ 122 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా 2017 మహిళల వరల్డ్ కప్‌లో నేరుగా అడుగుపెట్టబోతున్న రెండో జట్టుగా నిలిచింది. ఈ విజయం తరువాత ఇంగ్లండ్ 25 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
ఇప్పటికే ఆస్ట్రేలియా మహిళల జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఐఓసీ టైటిల్ గెలిచిన ఆసీస్ జట్టు 30 పాయింట్లతో వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ప్రస్తుతం 22 పాయింట్లతో ఉన్న వెస్టిండీస్ మహిళలు వరల్డ్ కప్ కు అర్హత సాధించే అవకాశానికి చేరువగా ఉన్నారు. ఇక్కడ టాప్-4లో ఉన్న జట్లే నేరుగా వరల్డ్ కప్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఆ తరువాత ఉన్న మిగతా నాలుగు జట్లు వచ్చే ఏడాది జరిగి క్వాలిఫయర్ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. 2017 ఫిబ్రవరి 7 నుంచి 21 వరకూ ఆ నాలుగు జట్లు క్వాలిఫయింగ్ టోర్నీ ఆడాల్సి ఉంది.