ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మృతి
అనంతపురం క్రైం: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనంతపురం జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు జే.నరేష్ (23) బుధవారం తుదిశ్వాస వదిలాడు. ఈ నెల 7న నరేష్‌తో పాటు ఉపాధ్యక్షుడు కుమార్ ఇద్దరూ ద్విచక్రవాహనంలో తాడిపత్రి బస్టాండు వైపు నుంచి శ్రీకంఠం సర్కిల్ వైపు వస్తుండగా, కృష్ణా థియేటర్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న టీవీఎస్-అపాచి ద్విచక్రవాహనం ఢీకొంది. గాయపడ్డ నరేష్ కొలంబియా ఏసియా ఆస్పత్రిలో 4 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఆరోజు నుంచి కోమాలోనే ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం మృత్యువాత పడ్డాడు.
ధర్మవరం పట్టణం గూడ్స్‌షెడ్డు కొట్టాలు (జీఎస్ కొట్టాలు)కు చెందిన నరేష్ 2007 నుంచి ఎస్ఎఫ్ఐలో పని చేస్తున్నాడు. గతేడాది 2014లో పీజీ పూర్తి చేశాడు. మంచి నాయకుడిగా ఎదిగే సమయంలో రోడ్డు ప్రమాదరూపంలో మృత్యువు నరేష్‌ను కబలించింది. నరేష్ తండ్రి పెద్దన్న తొమ్మిది నెలల కిందట అనారోగ్య కారణంగా మృతి చెందాడు. స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయం నుంచి నరేష్ మృతదేహంతో గురువారం ఉదయం అంతిమయాత్ర చేపట్టనున్నారు. నరేష్ మృతి పట్ల వివిధ విద్యార్థి సంఘాలు, వైఎస్సార్ విద్యార్థి విభాగం, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు సంతాపం తెలియజేశారు.