నేను సెల్ఫ్ మేడ్
ఏ గాడ్ ఫాదర్ లేకుండా... నిల్చున్న గ్రౌండ్‌నే బ్యాక్‌గ్రౌండ్‌గా చేసుకుని ఎదిగేవాళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా అరుదు. అనుష్కా శర్మ ఈ కోవకే వస్తారు. స్వయంకృషితో పేరు తెచ్చుకోవడంలో ఉన్న సంతృప్తి సిఫార్సులతో ఆఫర్లు తెచ్చుకుంటే లభించదంటున్నారామె. ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన అనుష్క మోడల్‌గా రాణించి బాలీవుడ్‌ను ఆకర్షించారు. టైమ్ బాగుంటే అదృష్టం వెంటే ఉంటుందన్నట్లు తొలి సినిమా ‘రబ్ నే బనాదీ జోడీ’లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ సరసన నటించే అవకాశం కొట్టేశారు. ఆ చిత్రవిజయంతో ఓవర్ నైట్ స్టారైపోయారు అనుష్క. ఇక ఆ తర్వాత బడా హీరోలతో సినిమాలు, ‘బ్యాండ్ బాజా బారాత్’, ‘లేడీస్ వర్సెస్ రికీ బాల్’, ‘జబ్ తక్ హై జాన్’, ‘పీకే ’ ఇలా వరుస విజయాలు అనుష్కకు అలవాటైపోయాయి.
ఎవరో రికమండేషన్ చేస్తే, తాను నిలదొక్కుకోలేదనీ ‘సెల్ఫ్ మేడ్’ అని అనుష్క అంటున్నారు. అలా చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని అన్నారామె. ప్రస్తుతం హీరోయిన్గా తనుకున్న నేమ్, ఫేమ్‌తో చాలా హ్యాపీగా ఉన్నానని అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ - ‘‘ఎలాంటి సినిమా నేపథ్యంలేని నేను హీరోయిన్ కావడమే గొప్ప. అలాంటిది షారుఖ్, సల్మాన్ ఖాన్ , ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే అది అదృష్టమే. వాళ్లతో నటించేందుకు నేను పనిగట్టుకుని చేసిన ప్రయత్నాలేవీ లేవు. అనుష్క ఈ కథకు న్యాయం చేస్తుందనే నమ్మకం దర్శకుల్లో ఉండటం వల్లే స్టార్లతో సినిమాలు చేయగలుగుతున్నా. అన్ని సినిమాల్లో నేనే ఉండాలని అత్యాశ లేదు. వచ్చిన ప్రతి అవకాశం ఒక మంచి బహుమతి అనుకుని పనిచేస్తా’’ అన్నారు.