ఉద్యోగనామ సంవత్సరం – 2017
న్యూఢిల్లీ: నిరుద్యోగులకు నూతన సంవత్సరం కలసిరానుంది! దేశంలో వ్యవస్థీకృత రంగం 8.75 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించనుంది. అయితే, సగటున వేతన పెంపు మాత్రం 9 శాతానికే పరిమితం అవుతుందని నిపుణుల అంచనా. డీమోనిటైజేషన్తో రియల్టీ, నిర్మాణం, మౌలిక రంగం, హైఎండ్ ఆటోమొబైల్స్ రంగంపై దీర్ఘకాలంలో గణనీయ ప్రభావమే ఉంటుందని... అదే సమయంలో పెద్ద నోట్ల రద్దు మరిన్ని వ్యవస్థీకృత ఉద్యోగాలను కల్పిస్తుందని మైహైరింగ్క్లబ్, జాబ్పోర్టల్ వెబ్సైట్లు ‘2017 సంవత్సరంలో ఉద్యోగ అవకాశాల ధోరణులు’ పేరుతో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
దేశవ్యాప్తంగా 21 మేజర్ పట్టణాల్లోని 6,790 కంపెనీల అభిప్రాయాలను సేకరించగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తయారీ, ఇంజనీరింగ్ రంగం ఉద్యోగాల కల్పనలో అన్నిటికంటే ముందుంటుందని మైహైరింగ్ క్లబ్, జాబ్పోర్టల్ సంస్థల సీఈవో రాజేశ్ కుమార్ తెలిపారు. ఈ సర్వే ప్రకారం ఈ ఏడాదిలో 9 శాతం మేర వేతనాలు పెరుగుతాయని ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తయారీ, ఇంజనీరింగ్ రంగంలో 9.9 శాతం, ఆ తర్వాత బ్యాంకింగ్ రంగంలో సగటున 9.7 శాతం వేతన వృద్ధి ఉండవచ్చనే అంచనాలు వ్యక్తమయ్యాయి.