డిగ్రీ కాలేజీకి నిధులిచ్చేందుకు సీఎం హామీ
- కాలేజీ ఆస్తుల పత్రాలు అప్పగింత
- కమిటీ సభ్యుల రాజీనామా
- జేఏసీ కన్వీనర్ జగన్నాథం వెల్లడి
కామారెడ్డి: ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రహరీ నిర్మాణానికి నిధులిచ్చేందుకు సీఎం అంగీకరించారని జేఏసీ నేతలు వెల్లడించారు.
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తూ కాలేజీ కమిటీ చేసిన తీర్మాన ప్రతులను ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిసి అప్పగించారు. ఈ మేరకు జేఏసీ డివిజన్ కన్వీనర్ జి.జగన్నాథం‘సాక్షి’కి తెలి పిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి కాలేజీ కమిటీ ఇచ్చిన రాజీనామా పత్రాలను అప్పగించినట్టు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాలేజీ స్థలానికి ప్రహరీ నిర్మాణానికి అవసరమై న నిధులు ఇస్తానని, వెంటనే సర్వే చేయించి అంచనాలు రూపొందించి తనకు అప్పగించాలని సీఎం ప్రభుత్వ విప్ గోవర్ధన్‌కు తెలిపారన్నారు. ప్రభుత్వ విప్ గోవర్ధన్‌తోపాటు డీసీఎంఎస్ చైర్మన్ ఎంకే ముజీబొద్దిన్, టీఆర్ఎస్ నాయకులు కొమ్ముల తిర్మల్‌రెడ్డి, నిట్టు వేణుగోపాల్రావ్, జేఏసీ నేతలు డాక్టర్ వి.శంకర్, మంద వెంకట్రాంరెడ్డి, వీఎల్ నర్సింహారెడ్డి, క్యాతం సిద్దరాములు తదితరులు సీఎంను కలిశారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రభుత్వం చూసుకుంటుందన్నారు.