‘తీరు మారకుంటే ఎడ్యుకేషన్ హాలిడే’
నాంపల్లి: తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థల ఉనికే లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి మారకుంటే ఎడ్యుకేషన్‌కు హాలిడే ప్రకటిస్తామని తెలంగాణ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్(కేజీ-పీజీ) జేఏసీ కన్వీనర్ రమణారెడ్డి అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో తనిఖీలు చేయడాన్ని జేఏసీ స్వాగతిస్తూనే, పోలీసులతో సోదాలు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. మంగళవారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్(కేజీ-పీజీ) సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమణారెడ్డి మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలపై మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రైవేట్ యాజమాన్యాలు రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సమస్యలు ఎదుర్కునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన ప్రైవేటు విద్యా సంస్థలపై విజిలెన్స్ దాడులు-ప్రభుత్వ విధానాలు అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్.ఎం.శ్రీనివాస్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. ప్రైవేట్ యాజమాన్యాలకు సంఘీభావం ప్రకటించారు.