వేడుకగా క్రిస్మస్ ఈవ్
శ్రీకాకుళం కల్చరల్, న్యూస్‌లైన్ :శ్రీకాకుళం పట్టణంలోని పలు క్రైస్తవ మందిరాలలో క్రిస్మస్ ఈవ్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నబ జారులోని తెలుగు బాప్టిస్టు దేవాలయంలో క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మంగళవారం సాయంత్రం కేండిల్ లైట్ సర్వీసు నిర్వహించారు. తొలుత చర్చి ఫాదర్ ఎ.జాకబ్ క్రీస్తు సందేశాన్ని అందించారు. అనంతరం చర్చి విశ్వాసులంతా కలసి కొవ్వొత్తులను వెలిగించి కేండిల్ సర్వీసు నిర్వహించారు. క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. మహిళలకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో చర్చి ప్రెసిడెంట్ ఎన్.భాస్కరావు, ట్రెజరర్ బి.అప్పారావునాయుడు, కౌన్సిల్ సభ్యులు ఎల్.చిట్టిబాబు పాల్గొన్నారు. కోడిరామమూర్తి స్టేడియం వద్దగల లూథరన్ చర్చిలో, మహిళా కళాశాల రోడ్డులోని క్రైస్తవారాధన మందిరంలో క్రిస్మస్ ఈవ్ జరిగింది.
తెలుగు బాప్టిస్టు చర్చి చరిత్ర 170 ఏళ్లు
శ్రీకాకుళంలోని చిన్నబజారు రోడ్డులోని తెలుగు బాప్టిస్టు చర్చి జిల్లాలో ప్రధమదిగా చెబుతారు. దీన్ని 1832లో ఈస్టిండియా కంపెనీకి చెందిన మిస్టర్ బ్రట్ జేమ్స్ డాసన్ క్రీస్తు ప్రార్ధనా మందిరంగా ఏర్పాటు చేశారు. 1846 సెప్టెంబర్ 12వతేదీన తెలుగు బాప్టిస్టు చర్చిగా మార్చి ప్రారంభించారు. అప్పట్లో రూ.6 వేల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఏసుక్రీస్తుపై అనేక గీతాలు రాసిన పురుషోత్తమ చౌదరి మొట్టమొదటి పాదర్‌గా ఇక్కడ పనిచేశారు. శిథిలావస్థకు చేరుకుంటున్న దశలో ఇటీవల రూ.60 లక్షల వ్యయంతో పునర్నిర్మాణం జరిగింది. ఆధునిక సౌకర్యాలతో 1500 మంది కూర్చొని ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా పెద్ద హాలు ఇక్కడ ఉంది. ప్రస్తుత చర్చి పాదర్‌గా రెవ. ఎ.జాకబ్ వ్యవహరిస్తున్నారు.
అతిపెద్ద చర్చిగా సహాయమాత ఆలయం
శ్రీకాకుళంలోని ప్రభుత్వ కళాశాల రోడ్డులో ఉన్న సహాయ మాత ఆలయం ఉత్తరాంధ్రాలోనే అతిపెద్ద ప్రార్ధనా మందిరంగా పేరుపొందింది. సుమారు వంద అడుగుల పొడవుతో రెండు గోపురాలు, పూజా పీఠం వెనుక ఏసుక్రీస్తు కడతేరడం వంటి సన్నివేశాలు, ఫైబర్ గ్లాసులో అమర్పిన పాత్ర ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తోంది. సుమారు 2 వేల మందికిపైగా ఒకేసారి ప్రార్ధనలు చేసుకునే వీలుగా హాలు నిర్మాణ చేశారు. ఫాదర్ ఎ.ప్రేమానందం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రార్ధనలు నిర్వహిస్తుంటారు.
రెండోపోప్ నిర్మించిన సెయింట్ థామస్ చర్చి
పట్టణంలోని టౌనుహాలు రోడ్డులో పునీత తోమాను దేవాలయం పేరుతో నిర్మితమైనది సెయింట్ థామస్ చర్చి. రెండో పోప్ జాన్‌పాల్ శ్రీకాకుళం వచ్చి దీన్ని నిర్మించగా... అడ్డగట్ల ఇన్నయ్య మొదటి ఫాదర్‌గా వ్యవహరించారు. 1999లో పునర్ నిర్మాణం జరిగింది. దీనిలో ఆరోగ్య మాత మందిరం ఉంది. వెయ్యిమంది ఒకేసారి ప్రార్ధనలు చేసుకోవచ్చు. ప్రస్తుతం రెవ. డాకనిక్ రెడ్డి పాదర్‌గా ఉంటూ బైబిల్ ప్రవచనాలు, ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు.